ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం:ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి పుతిన్‌ ఫోన్‌!

2022 Russian Invasion Of Ukraine Telugu News Live Updates Day 8 - Sakshi

Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు పెను విధ్వంసానికి దిగాయి. రెండు రోజులుగా గ్యాప్‌ లేకుండా విరుచుకుపడుతున్నాయి. ఎనిమిదవ రోజు సైతం విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్‌ బ్రెస్ట్‌ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.  రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్‌ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్‌ చేసిన రష్యన్‌ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. 

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌
ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ అర్థమైందని ఆయన అన్నారు. సుమారు వారు 90 నిమిషాలు మాట్లాడారు.

ఎట్టికేలకు ఉక్రెయిన్‌, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్‌- పోలాండ్‌ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే
1. వెంటనే కాల్పుల విరమణ
2.యుద్ధ విరమణ
3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు

మరో సారి ఉక్రెయిన్‌ రష్యా మధ్య చర్చలు..
మరో రెండు గంటల్లో ఉక్రెయిన్‌, రష్యా మధ్య చర్చలు జరగనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. చర్చలు చర్చలే..  దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్‌ ల్యూనిస్క్‌లను వదిలేయాలని ఉక్రెయిన్‌ అంటోంది.

యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేసిన ప్రతిదానికీ రష్యా తిరిగి చెల్లించేలా మా చర్యలు ఉండబోతున్నాయని తెలిపారు జెలెన్‌స్కీ.

రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్‌ మేజర్‌ జనరల్‌ హతమైనట్లు వెల్లడించిన నెక్‌స్టా మీడియా

ర‌ష్యాకు మ‌రో గ‌ట్టి షాకిచ్చిన ఉక్రెయిన్‌ సైనికులు
ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తి సామ‌ర్ద్యాలు క‌లిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్‌యూ-30 ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్‌) ర‌ష్యా సైనిక ప‌టాలంలో శత్రు దేశాల‌ను ఇట్టే భ‌య‌పెట్టే ఎయిర్ క్రాఫ్ట్‌. అయితే చిన్న దేశ‌మైన‌ప్ప‌టికీ ఉక్రెయిన్‌.. త‌న గ‌గ‌న త‌లం మీద‌కు వ‌చ్చిన ర‌ష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బ‌కు కూల్చేసింది. ఈ మేర‌కు ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాల క‌మాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జ‌న‌ర‌ల్ వాలేరీ జాలుజ్నియి కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

► ఉక్రెయిన్‌కు 2,700 యాంటీ ఎయిర్‌ మిస్సైల్స్‌ అందించనున్న జర్మనీ.

► ఖార్కీవ్‌లో పవర్‌ కట్‌. అంధకారంలోనూ ఆగని విధ్వంసం.

► ఉక్రెయిన్‌ ప్రధాన నగర దాడుల్లో రష్యా దళాలకు, ఉక్రెయిన్‌ రెబల్స్‌ చేతులు కలిపారు.

► ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ దళాలు రష్యా బలగాలను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఉదయం నుంచి రష్యా బలగాలదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది.

► స్కూళ్లు, మెట్రో స్టేషన్లే లక్ష్యంగా.. 
ప్రభుత్వ ఆస్తులు, కార్యాల‌యాల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రిపిన ర‌ష్యా.. ఇప్పుడు పూర్తిగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. ర‌ష్యా దాడులు తీవ్రత‌రం చేసి ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, భ‌వ‌నాల‌పై కూడా దాడులు జ‌రుపుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మరోవైపు మెట్రో స్టేషన్లు అక్కడ అండర్‌ గ్రౌండ్‌ బంకర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది రష్యా. 

► గురువారం ఉదయం.. కీవ్‌లోని మెట్రో స్టేషన్ స‌మీపంలో భారీ పేలుళ్లు సంభ‌వించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ పేలుళ్లు సంభ‌వించ‌డంతో పెద్ద ఎత్తున ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. కీవ్ న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు స్వాధీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకుంది. 

► ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, త‌దిత‌ర‌ ప్రాంతాల్లో ర‌ష్యా వైమానిక దాడుల‌కు సిద్ధమైంది. త‌మ‌పై విధించిన ఆంక్షల‌ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమ‌ని ర‌ష్యా ఇప్పటికే ప్రక‌టించింది. 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

► రష్యా దాడుల నేప‌థ్యంలో ఉక్రెయిన్లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. నిన్నటి వరకు 7 లక్షలుగా భావించిన వలసదారుల సంఖ్యను.. ఇప్పుడు 10 లక్షలుగా ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు యూఏఈ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌ వలసదారులకు ఆశ్రయాన్ని నిరాకరిస్తున్నాయి.

► ఇత‌ర దేశాల జోక్యం పెరిగితే ఉక్రెయిన్తో యుద్ధంలో అణ్వస్త్రాల‌ను వాడ‌డానికి కూడా ర‌ష్యా వెన‌కాడ‌బోద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే అణుయుద్ధం విష‌యంలో దేశ బలగాలను ర‌ష్యా అప్రమత్తం చేసిన విష‌యం తెలిసిందే.  రష్యా వద్ద 5,997 అణు వార్హెడ్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తెలిపింది. 

► రష్యా దాడులు తీవ్ర‌త‌రం చేసిన‌ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. పొరుగు దేశాల‌కు చేరుకునే క్ర‌మంలో చాలా మందికి ఆహారం అంద‌ట్లేదు. జ‌నావాసాల‌పై కూడా ర‌ష్యా దాడులు జ‌రుపుతుండ‌డంతో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల్లో ఉన్నారు. 

► రష్యా ఆరోపణలు.. ఖండించిన భారత్‌

భారత విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని ఉక్రెయిన్ తమతో పోరాడుతోందని రష్యా ఆరోపణలకు దిగింది. ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్‌ నుంచి బెల్‌గ్రేడ్‌కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులను ఖార్కివ్‌లో ఉక్రెనియన్ అధికారులు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ ప్రకటించారు. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ స్పష్టంచేశారు. 

కాగా.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చిందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ఆరోపణల అనంతరం ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది. భారతదేశం, పాకిస్తాన్, చైనా ఇతర దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారంటూ ఆరోపించింది.

ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులను బందీలుగా తీసుకున్న విషయమేదీ తమ దృష్టికి రాలేదని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్‌లు పరస్పరం భారతీయుల విద్యార్థులను బందీలుగా చేసుకున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ, అలాంటి సమచారం ఏదీ మా దాకా రాలేదు. ఇప్పటివరకైతే అంతా క్షేమంగా ఉన్నారు. వాళ్లను భారత్‌కు తరలించే ఆపరేషన్‌ గంగ కొనసాగుతోంది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఉక్రెయిన్‌పై స్పెషల్‌ ఆపరేషన్‌లో 498 మంది సైనికులు మృతి: రష్యా రక్షణ శాఖ
► ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు కొనసాగుతు​న్నాయి. ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలైన కీవ్‌, ఖర్వివ్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలపై రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్‌ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది.

► ఖెర్సాన్‌, బెర్డ్యాన్స్‌ ఓడరేవులను రష్యా స్వాధీనం చేసుకుంది. ఒడెస్సా, మరియూపూల్‌ స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం యత్నిస్తోంది. ఉక్రెయిన్‌పై స్పెషల్‌ ఆపరేషన్‌లో 498 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

► ఉక్రెయిన్‌ కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌ దక్షిణ నగరం ఖేర్సన్‌ రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిందని ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు.

► ఆపరేషన్‌ గంగ..  సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌ మూడోది 208 మంది భారతీయులతో పోలాండ్‌ నుంచి ఢిల్లీ హిందాన్‌ ఎయిర్‌బేస్‌లో ఈ ఉదయం దిగింది. సురక్షితంగా వచ్చిన ప్రయాణికులతో  ఎంవోఎస్‌ డిఫెన్స్‌ అజయ్‌ భట్‌ కాసేపు మాట్లాడారు.

► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ 76వ ‘అసాధారణ’ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. 

► ‘ఉక్రెయిన్‌పై దాడి’ పేరుతో రూపొందిన తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 141 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. దౌత్యం, చర్చలు తప్ప వివాద పరిష్కారానికి మరో మార్గం లేదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. భారత్‌తో పాటు మొత్తం 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. తీర్మానం ఆమోదం పొందిన సందర్భంగా కరతాళ ధ్వనులతో సమావేశ ప్రాంగణం మారుమోగిపోయింది.

► అణ్వాయుధ విభాగాన్ని యుద్ధసన్నద్ధం చేయాలన్న రష్యా నిర్ణయాన్ని సమావేశం ఖండించింది. ఆ దేశానికి బెలారస్‌ మద్దతును కూడా తీవ్రంగా తప్పుబట్టింది. రష్యా తక్షణం యుద్ధాన్ని ఆపాలని, ఉక్రెయిన్‌ నుంచి తన బలగాలన్నింటినీ బేషరతుగా, సంపూర్ణంగా, తక్షణం ఉపసంహరించాలని డిమాండ్‌ చేసింది. 

► ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర హోదా ఇస్తూ రష్యా తీసుకున్న నిర్ణయాన్ని కూడా నిరసించింది. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని తక్షణం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలిలోనూ ఆదివారం ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా రష్యా వీటో చేయడం తెలిసిందే. 

►  ఈ నేపథ్యంలో జనరల్‌ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాల్పుల విరమణ తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి పేర్కొన్నారు. భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు భారీగా ఉక్రెయిన్‌లో చిక్కుబడ్డారని, ఒకరు కాల్పులకు బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top