
ఈసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం దుమ్ము రేపింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్, ఎలాగైనా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్, భవిష్యత్‌కు బాటలు వేసుకోవడంతోపాటు కాలం కలసివస్తే పవర్ దక్కుతుందనే ధీమాతో బీజేపీ, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు, ఫార్వర్డ్‌బ్లాక్‌తో పాటు ఇతర రిజిస్టర్డ్ పార్టీల గుర్తులపై, స్వతంత్రులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులంతా కలిసి రెండు నెలలుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.
బీఆర్‌ఎస్ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌లు రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, భట్టి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, యోగి, హిమంతబిశ్వ శర్మ, రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, స్మృతీ ఇరానీ తదితరులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు, బీఎస్పీ నుంచి మాయావతి, సీపీఐ నుంచి రాజా, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, బృందాకారత్, మాణిక్‌సర్కార్ తదితరులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజా ఆశీర్వాద సభలతో బీఆర్‌ఎస్
అసెంబ్లీ ఎన్నికల ప్రచార అంకానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ప్రచార తీరుతెన్నులు సమీక్షించడంతో పాటు పోలింగ్ ముగిసేంత వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించింది. ప్రధాన విపక్ష పార్టీలతో పోలిస్తే బీఆర్‌ఎస్ పార్టీ ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.
బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15న మొదలుకుని రెండు విడతల్లో కలుపుకుని 33 రోజుల వ్యవధిలో 96 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజా ఆశీర్వాద సభలు’ పేరిట జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగాల్సిన బహిరంగ సభను చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. ప్రచారం చివరి రోజున తాను పోటీ చేస్తున్న గజ్వేల్‌లో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ ముగింపు పలికారు.
పార్టీ స్టార్ ప్రచారకర్తలైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడా బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. రెండు నెలలుగా ఈ ఇద్దరూ సభలు, రోడ్‌షోలు, వివిధ వర్గాలతో భేటీలు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా గడిపారు. తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటూనే సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తున్న గజ్వేల్‌లో హరీశ్‌రావు, కామారెడ్డిలో కేటీఆర్ ప్రచారాన్ని పర్యవేక్షించారు. మంత్రి కేటీఆర్ 70 రోడ్‌షోలు, 30 బహిరంగసభల్లో పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు కూడా సుమారు అంతే సంఖ్యలో రోడ్‌షోలు, ప్రచార సభల్లో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ నెల 22న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేటీఆర్, హరీశ్‌కూడా కొడంగల్‌లో రోడ్‌షోలు నిర్వహించి పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ తదితరులు గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ ప్రచారానికి నేతృత్వం వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి తదితరులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల పరిధిలో అడపాదడపా ప్రచారంలో పాల్గొన్నారు.
మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతూ
ఎన్నికల మేనిఫెస్టోను గత నెల 15న ప్రకటించడంతో పాటు అదే రోజు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ తాను పాల్గొన్న ప్రచార సభల్లో అందులోని అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. నిఘా సంస్థల నివేదికలు, సర్వే సంస్థలు, వివిధ మార్గాల్లో అందిన సమాచారాన్ని క్రోడీకరించి మేనిఫెస్టోలో అదనపు అంశాలను కూడా ప్రచార క్రమంలో జోడించారు.
గల్ఫ్, బీడీ, ఆటో కారి్మకులకు పలు హామీలు ఇవ్వడంతో ఉద్యోగ నోటిఫికేషన్లు తదితరాలపై ఓటర్లలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేటీఆర్ ప్రచార అంకంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. నిరుద్యోగ యువత, తొలి ఓటర్లు, మహిళా ఓటర్లు, మైనారిటీ ఓటర్లు ఇలా పలువురితో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు.
ఓ వైపు ప్రచార లోపాలను సరిదిద్దుకుంటూనే పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్న చోట దానిని తటస్థ స్థితి (న్యూట్రలైజేషన్)కి తీసుకు వచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రచార, ప్రసార సాధనాల ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాలు, మేనిఫెస్టోలోని అంశాలను బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ వివిధ రూపాల్లో ముమ్మర ప్రయత్నాలు చేసింది.
కాంగ్రెస్ కదిలిందిలా...!
ఈ ఏడాది జూలై 2వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కదనరంగంలోకి దూకింది. ఖమ్మం వేదికగా జరిగిన ‘తెలంగాణ ప్రజాగర్జన’ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరారు. అదే రోజున భట్టి విక్రమార్క తన పాదయాత్రను ముగించారు. రాహుల్‌గాంధీ హాజరైన ఈ సభ వేదికగానే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పింఛన్ ప్రకటించారు.
ఆగస్టు 12న ‘తిరగబడదాం–తరిమికొడదాం’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. బోయిన్‌పల్లిలోని రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌సెంటర్‌లో 16 అంశాలతో బీఆర్‌ఎస్, బీజేపీలపై చార్జిషీట్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు 26న చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఖర్గే ప్రకటించారు. సెపె్టంబర్9వ తేదీన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీతో పాటు ఎన్నికల కోసం మరో 8 కమిటీలను ప్రకటించింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కాదని ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 16,17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగానే తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభకు సోనియా, రాహుల్, ఖర్గేలు హాజరయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కల అని చెప్పిన సోనియా ఆ సభ వేదికగానే ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 15న 55 మందితో కాంగ్రెస్ తన తొలి జాబితాను ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలిసారి రాష్ట్రానికి రాహుల్‌గాంధీ అక్టోబర్ 18న తెలంగాణకు వచ్చారు. తన సోదరి ప్రియాంకతో కలిసి వచి్చన రాహుల్ రామప్ప ఆలయాన్ని సందర్శించుకుని ములుగు నియోజకవర్గంలోని రామాంజిపూర్‌లో కార్నర్‌మీటింగ్‌కు హాజరయ్యారు. తర్వాతి రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాహుల్‌యాత్ర నిర్వహించారు.
సింగరేణి కార్మికులతో భేటీ అయ్యారు. అక్టోబర్ 28న సంగారెడ్డిలో జరిగిన విజయభేరి సభకు ఖర్గే, భట్టి, రేవంత్, జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. అదే నెల 31న కొల్లాపూర్‌లో జరిగిన పాలమూరు ప్రజాభేరి సభకు రాహుల్ వచ్చారు. నవంబర్1వ తేదీన రాహుల్ గాంధీ కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ రోజే బీసీ జనగణన చేస్తామని ప్రకటించారు.
నవంబర్2వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి కాళేశ్వరంలో అవినీతిని ఎత్తి చూపారు. నవంబర్7వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఆలంపూర్ నుంచి ప్రారంభించి మొత్తంగా 63 నియోజకవర్గాల్లో పర్యటించి 87 సభల్లో పాల్గొన్నారు. రాహుల్ 25, ప్రియాంక 26, ఖర్గే 10 ఎన్నికల సభల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
డిక్లరేషన్ల ప్రకటన..: నవంబర్ 9 న హైదరాబాద్‌లో కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేతుల మీదుగా మైనార్టీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఆ తర్వాతి రోజునే కామారెడ్డిలో జరిగిన సభకు హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఆ తర్వాత నవంబర్17న గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. నవంబర్19న ఖానాపూర్‌లో జరిగిన సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. అదే నెల 22న నల్లగొండ, అలంపూర్‌లో జరిగిన సభలకు ఖర్గే హాజరయ్యారు.
ఇక, ఈనెల 24న మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించారు. మరుసటి రోజు ప్రియాంకాగాంధీ పాలేరు, ఖమ్మం, మధిర అసెంబ్లీల పరిధిలో ప్రచారం నిర్వహించారు. అదే రోజున కల్వకుర్తి, సనత్‌నగర్ సభలకు ఖర్గే, ఆదిలాబాద్, బోధన్, వేములవాడ ఎన్నికల ప్రచార సభలకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. మరుసటి రోజున కామారెడ్డి, ఆందోల్, సంగారెడ్డి సభలకు రాహుల్, కొడంగల్‌కు ప్రియాంక వెళ్లారు.
ఇక, ప్రచారం ముగియనున్న చివరి రోజున రాహుల్‌గాంధీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్‌గిరి స్థానాల్లో ప్రచారం చేయగా, ప్రియాంకాగాంధీ జహీరాబాద్, మల్కాజ్‌గిరి సభలకు హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తెలంగాణకు రాలేకపోయిన సోనియాగాంధీ వీడియో సందేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించింది.
కమలదళం..కదన రంగం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్రమంతా విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం వరకు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే అక్టోబర్ 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లలో బహిరంగసభల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలో పార్టీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ప్రచారపర్వం ముగియడానికి ఒకరోజు ముందే...సోమవారం రాత్రికల్లా మోదీ, అమిత్‌షా, నడ్డా తమ మలివిడత ప్రచారాన్ని పూర్తి చేశారు.
మోదీ వరుస పర్యటనలు
ఎన్నికల షెడ్యూల్ జారీకి ముందు మోదీ రెండురోజుల పర్యటన (మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభలు) కూడా కలిపితే, మొత్తంగా ఆయన ఏడు రోజులు రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ పక్షాన నిర్వహించిన బీసీల ఆత్మగౌరవసభ, ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినసభకు మోదీ హాజరయ్యారు. ఇవి కూడా కలిపి మొత్తం 10 సభలు, ఒక రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఈ నెల 25న కామారెడ్డి, మహేశ్వరం పరిధిలో నిర్వహించిన బహిరంగసభలు, 26న నిర్మల్, తూప్రాన్‌లలో సభలు, 27న మహబూబాబాద్, కరీంనగర్‌లో ఎన్నికల బహిరంగసభలతో పాటు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ పర్యటనల్లో భాగంగా...ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. కన్హా శాంతివనంలో రామచంద్రమిషన్ కార్యక్రమం, తిరుమల వెంకన్న దర్శనం, అమీర్‌పేటలోని గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో మోదీ పాల్గొన్నారు.
అమిత్‌షా 22 దాకా సభల్లో...
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడతల వారీగా పర్యటించడంతో పాటు, ఈ నెల 24 నుంచి 27 దాకా ప్రచారంలోనే తలమునకలయ్యారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట, కోరుట్ల, కొల్హాపూర్, ఖైరతాబాద్, మక్తల్, ములుగు, భువనగిరి, మునుగోడు, పటాన్‌చెరు, ఆర్మూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, ఉప్పల్, నల్లగొండ, వరంగల్, గద్వాల, సూర్యాపేట కలుపుకొని మొత్తం 22 సభలతోపాటు, రోడ్‌షో, ఎంఆర్‌పీఎస్ మీటింగ్‌లో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్, ముషీరాబాద్, కూకట్‌పల్లి, జగిత్యాల, బాన్సువాడ, జుక్కల్, బోధన్, హుజూర్‌నగర్ , చేవెళ్ల, నారాయణపేట, మల్కాజ్‌గిరి, నిజమాబాద్ అర్బన్, సంగారెడ్డి ఇలా 15 బహిరంగసభల్లో ప్రసంగించారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుజూరాబాద్, మహేశ్వరం, కంటోన్మెంట్, ఆర్మూర్, మేడ్చల్, కార్వాన్‌లలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొల్లాపూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బహిరంగసభల్లో ప్రసంగించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిర్పూర్, వేములవాడ, గోషామహల్, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, సనత్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లలో, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ చార్మినార్, మలక్‌పేట్, సిర్పూర్, పరకాల, దేవరకద్ర బహిరంగసభల్లో ప్రసంగించారు.
బీఎస్పీ, సీపీఎం, సీపీఐ
ప్రధాన పార్టీలతో సమానంగా బీఎస్పీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సూర్యాపేట, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎవరితోనూ పొత్తులేకుండా సీపీఎం మొత్తం 19 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి రంగంలో ఉన్నారు. సీపీఎం తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీతారాం ఏచూరి పాలేరు, ఖమ్మం, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు.
సీపీఐ పోటీ చేస్తున్న ఒకే ఒక్క సీటు కొత్తగూడెంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి నారాయణ, పోటీ చేస్తున్న అభ్యరి్థ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు ప్రచారంలో పాల్గొన్నారు.
ఇది చదవండి: Telangana Assembly Elections: ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి
Comments
Please login to add a commentAdd a comment