డెడ్‌లైన్‌ సండే! | - | Sakshi
Sakshi News home page

డెడ్‌లైన్‌ సండే!

Mar 4 2025 6:40 AM | Updated on Mar 4 2025 6:38 AM

ఆలోపు అక్రమ హోర్డింగ్స్‌ తొలగించండి

నిర్వాహకులకు స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్‌

ఏజెన్సీల ప్రతినిధులతో ప్రధాన కార్యాలయంలో భేటీ

సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా అనుమతులు లేకుండా, అనుమతి గడువు ముగిసినా కొనసాగుతున్న అక్రమ హోర్డింగ్స్‌ను ఆదివారం లోపు తొలగించాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. అలా కాకుంటే తాము వాటిపై చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. సోమవారం తన కార్యాలయంలో యాడ్‌ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు మూడు నెలల క్రితమే తొలగింపు ప్రక్రియ చేపట్టామని, అయితే యాడ్‌ ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు కొంత సమయం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలలుగా పలుమార్లు మున్సిపల్‌ కమిషనర్లు, యాడ్‌ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ హోర్డింగ్స్‌పై ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాల్సి ఉండటంతో రెన్యూవల్స్‌ ఆగిపోయాయని పలువురు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగానే 2022–23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుములు కూడా కట్టలేకపోయామని రంగనాథ్‌కు తెలిపారు. 2023 మార్చి 31 వరకూ చెల్లింపులు చేసిన హోర్డింగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ తొలగించమని హామీ ఇచ్చిన రంగనాథ్‌ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి చెప్పారు. ఈ హోర్డింగ్స్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా ప్రస్తుతం కేవలం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు వరకే వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ హోర్డింగుల తొలగింపు విషయంలో హైడ్రా ఎవరికీ, ఎలాంటి మినహాయింపులకు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా తాము పని చేస్తున్నామని రంగనాథ్‌ పునరుద్ఘాటించారు. హోర్డింగుల ఏర్పాటుతో పాటు ప్రకటనల రుసుం చెల్లింపు విషయంలో ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే ఆ ప్రకారం నడచుకోడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని యాడ్‌ ఏజెన్సీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌కు తెలిపారు. బాలాపూర్‌లో అనుమతి లేని హోర్డింగ్స్‌ను తొలగిస్తున్నప్పుడు హైడ్రాపై ఆరోపణలు చేసిన అఖిల యాడ్‌ ఏజెన్సీ యజమాని తమను కూడా తప్పుదోవ పట్టించారని పలువురు రంగనాథ్‌కు తెలిపారు. అఖిల యాడ్‌ ఏజెన్సీ పేరిట మీర్‌పేటలో ఉన్న అనుమతులను చూపించిన యజమాని బాలాపూర్‌ చౌరస్తాలో అక్రమంగా హోర్డింగులను ఏర్పాటు చేసినట్టు హైడ్రా ఆధారాలను ఏజెన్సీల ప్రతినిధులకు చూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement