సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఒకప్పటిలా అమ్మమ్మ వాళ్లింటికో, బంధువుల ఇంటికో కాకుండా దేశంలోని పర్యాటక ప్రదేశాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎయిర్ బీఎన్‌బీ హాస్పిటాలిటీ సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా గోవా, కేరళలోని బీచ్‌లతో పాటు వారణాసి, ఢిల్లీ వంటి చారిత్రాత్మక, సాంస్కృతికంగా ప్రాముఖ్యమున్న ప్రాంతాలను చుట్టేస్తున్నారని పేర్కొన్నారు. ఆహ్లాదం, ఆధ్యాత్మికం, అడ్వెంచర్లతో పాటు సైట్ విజిట్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు భారతీయులు. ఎయిర్ బీఎన్‌బీ సర్వేలో భాగంగా మిలాన్, టోక్యో, రోమ్, ఫ్రాంక్‌ఫర్ట్ వంటి అంతర్జాతీయం ప్రాంతాలను ఫేవరెట్ డెస్టినేషన్స్‌గా మార్చుకున్నారని వివరించారు. బాలీవుడ్ సినిమాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావంతో ఈ ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. సరికొత్త అనుభూతి, నూతన ప్రదేశాలను కనుగొనేందుకు ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన ప్రయాణాలూ చేస్తున్నారని ఆగ్నేయాసియా దేశాల ఎయిర్ బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ పేర్కొన్నారు.