
రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు
కాంగ్రెస్‌లోకి ఐదుగురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
బోడుప్పల్: బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి చామకూర మల్లారెడ్డికి షాకిచ్చారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో గురువారం వీరు హస్తం గూటికి చేరారు. వీరిలో బింగి జంగయ్య యాదవ్, దానగల్ల అనిత, జడిగె మహేందర్ యాదవ్, రాసాల వెంకటేశ్ యాదవ్, గుర్రాల రమా ఉన్నారు. నిన్నా మొన్నటి దాకా మేడ్చల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్లు ఒక్కసారిగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఊహించని పరిణామం. వీరి చేరికతో మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన రాజకీయ పలుకుబడి, చతురతతో బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని దెబ్బతీసేలా పావులు కదుపుతున్నారు. తన పాత మిత్రులైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులతో సంద్రింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌యాదవ్ గెలుపు కోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.