అందని ద్రాక్షగానే డబుల్‌ బెడ్రూం ఇళ్లు

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరిగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో పేదల సొంతింటి కల పూర్తిస్థాయిలో సాకారం అవుతుందా? అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇంటి తాళాలు చేతిలో పెడ్తామన్న బీఆర్‌ఎస్‌ సర్కారు హామీ కొద్ది కుటుంబాలకే పరిమితం చేసింది. తొమ్మిదేళ్లలో తొమ్మిది శాతం కుటుంబాలకు కూడా సొంత ఇళ్ల కల నెరవేరలేదు. తాజాగా ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల హామీతో నిరుపేదల కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరంలో మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. మరోవైపు గృహలక్ష్మి పథకాన్ని కూడా కొనసాగిస్తామని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా అందిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. ఈ రెండు ప్రధాన పార్టీల హామీలతో నిరుపేదల ఆశలు చిగురించనున్నాయి.

ఇదీ పరిస్థితి..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం నగరంలోని దాదాపు 111 ప్రాంతాల్లో ఒక లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో పాత ఇళ్లు తొలగించిన (ఇన్‌ సీటు) 40 ప్రాంతాల్లో 8,898 గృహాలు, 71 ఖాళీ స్థలాల్లో 91,102 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు చేపట్టింది. రెండు నెలల క్రితం నాటికి అతికష్టమ్మీద 68,176 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసింది. మిగతా 38 ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. రెండు లొకేషన్లలో 2,026 గృహాల నిర్మాణాలు వివిధ కారణాలతో నిలిచిపోయాయి.

లక్షల్లో దరఖాస్తులు.. వేలల్లో ఇళ్లు

● గ్రేటర్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం పేద కుటుంబాల నుంచి లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. అతి కొద్ది కుటుంబాలకు మాత్రమే ఇళ్ల కల సాకారమైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలో అర్బన్‌ నియోజవర్గాలకు చెందిన దాదాపు పది లక్షల కుటుంబాలు డబుల్‌ బెడ్రూం ఇళ్లపై ఆశలతో దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మీ–సేవ ఆన్‌లైన్‌ ద్వారా సుమారు 7.09 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా, ఆఫ్‌లైన్‌ (నేరుగా)లో మూడు లక్షల వరకు కుటుంబాలు కలెక్టరేట్‌ ఆఫీసుల్లో దరఖాస్తులు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

● ఎన్నికల నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో అధికారులు కేవలం ఆన్‌లైన్‌ దరఖాస్తులపై దృష్టి సారించి హడావుడిగా ప్రాథమిక పరిశీలన నిర్వహించి సగం వరకు తిరస్కరించారు. మిగిలిన సుమారు 3.60 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగి దాదాపు 1.60 లక్షల దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశాయి. మరో రెండు లక్షల దరఖాస్తుల విచారణను పెండింగ్‌లో పడేశారు.

67,444 కుటుంబాలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు

మహానగర పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాలు, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు అర్బన్‌ నియోజక వర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని ఐదు అర్బన్‌ నియోజకవర్గాలకు చెందిన సుమారు 67, 444 నిరుపేద కుటుంబాలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు లభించాయి. అందులో పాత గృహాలు కోల్పోయిన సుమారు 5,666 కుటుంబాలకు పాత స్థలాల్లోనే, అసలు ఇళ్లు లేని దరఖాస్తు చేసుకున్న 61,784 కుటుంబాలకు శివారు ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేరింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు హడావుడిగా ఆన్‌లైన్‌ ర్యాండమైజేషన్‌ పద్ధతిలో తొలి విడతలో 11,700, రెండో విడతలో 13,200, మూడో విడతలో 36,884 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నగర శివారులోని 9 ప్రాంతాల్లో ఇళ్లను కేటాయించారు.

కుటుంబాలు లక్షలో.. ఇచ్చింది వేలల్లో

నగరానికి మరో లక్ష గృహాలిస్తామని బీఆర్‌ఎస్‌

ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తామన్న కాంగ్రెస్‌

రెండు ప్రధాన పార్టీల హామీలతో సొంత గూటిపై పేదల ఆశలు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top