Telangana Crime News: TS Crime News: 'చెడ్డీ గ్యాంగ్‌' ప్రధాన నిందితుడి అరెస్ట్‌..!
Sakshi News home page

TS Crime News: 'చెడ్డీ గ్యాంగ్‌' ప్రధాన నిందితుడి అరెస్ట్‌..!

Aug 25 2023 5:32 AM | Updated on Aug 25 2023 10:59 AM

- - Sakshi

హైదరాబాద్‌: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ ప్రధాన నిందితుడిని మియాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాదాపూర్‌ డీసీపీ సందీప్‌ రావు గురువారం వివరాలు వెల్లడించారు. హఫీజ్‌పేట్‌లోని వసంత విల్లాస్‌లో 75వ విల్లాలో నివాసం ఉంటున్న రాంసింగ్‌ కుటుంబంతో సహా ఈ నెల 6న సంగారెడ్డికి వెళ్లాడు. 7న సాయంత్రం అతను తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్‌ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్‌ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుజరాత్‌, ఆంబ్లీ ఖాజురియా గ్రామానికి చెందిన మినమ ముఖేష్‌ బాయ్‌ని ఆదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

విక్రం బాయ్‌ దరియా బాయ్‌ పార్మర్‌, మోహనియా నితిన్‌బాయ్‌, సుర్మల్‌ అలియాస్‌ సుమోతో కలిసి ఆగస్టు 5న లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేసుకున్న వారు రెండు రోజుల పాటు అమీన్‌పూర్‌, మియాపూర్‌ పీఎస్‌ల పరిధిలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించారు. 6వ తేదీ రాత్రి అమీన్‌పూర్‌ పీఎస్‌ పరిధిలో మూడు ఇళ్లలో చోరీ చేశారు. ఆ తర్వాత 7న తెల్లవారుజామున వసంత విల్లాస్‌లో చోరీకి పాల్పడ్డారు.

చోరీ సొత్తుతో గుజరాత్‌కు పారిపోయారు. గుజరాత్‌లో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న విక్రం బాయ్‌ దరియా బాయ్‌ పార్మర్‌ను దాహోడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నితిన్‌ బాయ్‌, సుర్మల్‌ అలియాస్‌ సుమో పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సీసీ కెమెరాల్లో చిక్కకుండా..
నిందితులు మొదట అమీన్‌పూర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు విప్పి అండర్‌ వేర్‌పై తాళ్లసాయంంతో మూడు ఇళ్లలో ప్రవేశించి తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకున్నారు. అనంతరం దుస్తులు ధరించి హఫీజ్‌పేట్‌లోని వసంత విల్లాస్‌ ప్రాంతానికి చేరుకున్నారు.

ఇక్కడ కూడా దుస్తులు విప్పి విల్లా వెనక నుంచి లోపలికి ప్రవేశించి రాడ్లతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎవరైనా వీరిని అడ్డుకుంటే దాడి చేసేందుకు వెనకాడరని డీసీపీ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో మాదాపూర్‌ ఏడీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, మియాపూర్‌ ఏసీపీ నర్సింహ్మ రావు, సీసీఎస్‌ ఏసీపీ శశాంక్‌ రెడ్డి, సీఐలు ప్రేమ్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement