అనగనగా లష్కర్‌.. అదో రైల్వే సైరన్‌ | Sakshi
Sakshi News home page

అనగనగా లష్కర్‌.. అదో రైల్వే సైరన్‌

Published Wed, Apr 5 2023 7:28 AM

- - Sakshi

స్వాతంత్య్రానికి పూర్వం సైనిక బలగాల స్థావరాలతో సికింద్రాబాద్‌ విరాజిల్లింది. జవాన్‌లకు స్థావరంగా ఉండడంతో ఈ ప్రాంతానికి లష్కర్‌ అని కూడా పేరు వచ్చింది. నిజాం పరిపాలనలో సికింద్రాబాద్‌ నగరంలోని రెజిమెంటల్‌ బజార్‌, బోట్స్‌ క్లబ్‌, ట్యాంక్‌బండ్‌, బేగంపేట్‌ ప్రాంతాలు సైనిక స్థావరాలకు కేంద్రాలుగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం ఇక్కడి సైనిక స్థావరాలు శివారు ప్రాంతాలకు తరలి వెళ్లగా ఈ ప్రాంతం జనావాసాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా మారింది. తొలుత ఒకే ఒక్క సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అందుబాటులో ఉండగా ప్రస్తుతం సికింద్రాబాద్‌ నగరం రైల్వేస్టేషన్ల సమాహారంగా మారింది.

నేడు 21 రైల్వేస్టేషన్లకు నిలయంగా..
► సికింద్రాబాద్‌ క్లాట్‌ టవర్‌ నుంచి చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు మొత్తంగా సైనిక స్థావరాలు కొలువుదీరి ఉండేవి. క్రమేణా సైనిక స్థావరాల స్థానంలో రైల్వేస్టేషన్‌లు వచ్చి చేరాయి. సికింద్రాబాద్‌ ప్రధాన రైల్వేస్టేషన్‌తో పాటు చుట్టుపక్కల 21 రైల్వేస్టేషన్లు ఏర్పాటయ్యాయి.

► సికింద్రాబాద్‌లోని ఏ రహదారి చూసినా సాధారణ, ఎంఎంటీఎస్‌, మెట్రో రైళ్ల స్టేషన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 2 సాధారణ, 13 మెట్రో, 6 ఎంఎంటీఎస్‌ స్టేషన్ల నుంచి రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అన్ని స్టేషన్ల నుంచి నడుస్తున్న వందలాది రైళ్లలో సగటున 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్టు అంచనా.

స్టేషన్లు... వంతెనలు
► సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా 6 ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తార్నాక మొదలుకొని బేగంపేట, జూబ్లీబస్‌ స్టేషన్‌ నుంచి ముషీరాబాద్‌ వరకు 13 మెట్రో రైల్వేస్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

► సికింద్రాబాద్‌లో మెట్రో నిర్మాణాలు ఈ ప్రాంతానికి కొత్తరూపు తెచ్చాయి. ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి. సికింద్రాబాద్‌ రేతీఫైల్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో ఒలిఫెంటా వంతెన కిందినుంచి వాహనాలు, మీదినుంచి సుదూర ప్రాంతాల రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ఈ వంతెన పై నుంచి మరింత ఎత్తైన మెట్రోరైలు వంతెనను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ వైఎంసీఏ కూడలిలో వాహనాల రాకపోకల కోసం ఫ్లై ఓవర్‌, సమాంతరంగా జింఖానా మెట్రోస్టే మెట్రో కారిడార్‌ను నిర్మించారు. రెండు సమాంతర వంతెనలు ఉండగానే ఫలక్‌నుమా–జేబీఎస్‌కు మెట్రోరైళ్లు రాకపోకల కోసం రెండు వంతెనల పై నుంచి మరో మెట్రో కారిడార్‌ను నిర్మించారు.

కనువిందుగా రైళ్ల పరుగులు..
సికింద్రాబాద్‌ నగరంలో ఏ రహదారికి వెళ్లినా రైల్వేస్టేషన్లు, వంతెనలు, రైల్వేట్రాక్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి వంతెనలపై మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌ రైళ్ల పరుగులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మూడు రకాల రైళ్ల రాకపోకలకు ఈ ప్రాంతం నిలయంగా మారింది. సాధారణ, ఎంఎంటీఎస్‌, మెట్రో రైళ్లు లెవల్‌క్రాసింగ్‌లు, వంతెలనపై తీస్తున్న పరుగులు సందర్శకులకు ముచ్చట గొలుపుతున్నాయి.

రైల్వే కార్యాలయాల సముదాయం..
రైల్వేస్టేషన్లతో పాటు పలు రైల్వే కార్యాలయాలు సికింద్రాబాద్‌ నగరంలోనే నెలకొని ఉన్నాయి. రైల్‌నిలయం, సంచాలన్‌ భవన్‌, హైదరాబాద్‌ భవన్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఇక్కడి భారీ భవన సముదాయాల్లో రైల్వేశాఖకు చెందిన పలు దక్షిణమధ్యరైల్వే కేంద్ర కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వర్క్‌షాపు, ప్రింటింగ్‌ ప్రెస్‌, రైల్వే ప్రదాన ఆసుపత్రి, జోనల్‌ ట్రైనింగ్‌ సెంటర్లు అన్నీ సికింద్రాబాద్‌ నగరంలోనే నెలకొని ఉండడం గమనార్హం. దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారుల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు సికింద్రాబాద్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. రైల్వే కాలనీలు, కార్యాలయాలు లష్కర్‌లో నెలకొని ఉన్నందున వివిధ రాష్ట్రాలకు చెందిన అన్ని మతాల రైల్వే ఉద్యోగులు ఇక్కడ నివసిస్తుండటంతో సికింద్రాబాద్‌ను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన నగరంగా పోల్చుతుండడం గమనార్హం.

 

Advertisement
 
Advertisement
 
Advertisement