Japan's Yokohama Zoo: జపాన్‌ నుంచి నెహ్రూ జూ పార్క్‌కు అరుదైన అతిథులు! జనవరిలోనే..

Hyd Nehru Zoo Park To Get Animals From Japans Zoo In January - sakshi - Sakshi

జపాన్‌ నుంచి నెహ్రూ జూ పార్కుకు    

జత కంగారూల రాకకు రంగం సిద్ధం 

వచ్చే జనవరిలో తెప్పించే అవకాశం   

జంతు మార్పిడిలో భాగంగానే..  

దత్తతకు ముందుకొచ్చిన కార్పొరేట్‌ సంస్థ  

అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. రానున్న వేసవిలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. ఇక్కడి వాతావరణంలో కంగారూలు మనుగడ సాగిస్తాయా? లేదా అనే మీమాంస మధ్య జపాన్‌ నుంచి నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్‌)లోకి జత కంగారూలు రానున్నాయి. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వీటిని ఇక్కడికి  తీసుకురానున్నారు.  
– సాక్షి, సిటీబ్యూరో 

జపాన్‌లోని యోకోహామా జంతు ప్రదర్శనశాలలోని జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌ మధ్య ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్‌ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ అనుమతి లభించిన తర్వాత కంగారూల తరలింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తానికి ఎండాకాలం సెలవులు మొదలయ్యేనాటికి కంగారూలు రంగప్రవేశం చేస్తాయని నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌ వెల్లడించారు. జపాన్‌లోని యోకోహామా జూ నుంచి కంగారూలు, మీర్‌క్యాట్‌ (అడవి పిల్లి)కి బదులుగా యోకోహామా జూకు ఆసియా సింహాన్ని ఇవ్వనున్నట్లు క్యూరేటర్‌ తెలిపారు.  

గ్లాండ్‌ ఫార్మా ద్వారా ఎన్‌క్లోజర్‌
►జూకు రానున్న కంగారూల కోసం ఎన్‌‎క్లోజర్‌ నిర్మాణ పనులకయ్యే ఖర్చును భరించడానికి దుండిగల్‌లోని గ్లాండ్‌ ఫార్మాస్యూటికల్‌ లిమిటెడ్‌ కంపెనీ ముందుకొచ్చింది. కంగారూల ఎన్‌క్లోజర్‌ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్‌ ఫార్మా అధికారులు ఇప్పటికే జూ అధికారులకు  అందజేశారు. ఎన్‌‎క్లోజర్‌ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.  
►కరోనా మహమ్మారి సీజన్‌లో నిధుల కొరత కారణంగా జూ అభివృద్ధికి రాజీ పడకుండా జంతువుల కందకాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని, జంతువులను దత్తత తీసుకుని జూలోని వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకునేందుకు పౌరులు, కార్పొరేట్‌ సంస్థలు అందరూ ముందుకు రావాలని క్యూరేటర్‌ విజ్ఞప్తి చేశారు. 

173 జాతులు.. 1,800 ప్రాణులు..   
380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్క్‌లో ప్రస్తుతానికి 173 జాతులకు చెందిన 1,800 జీవాలు ఉన్నాయి. కొత్తగా రాబోయే కంగారూలు, మీర్‌ క్యాట్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతువుల మార్పిడిలో భాగంగా గత ఏడాది నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పొపొటమస్, సింహం లాంటి తోకలుండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, జిరాఫీల జంట, నాలుగు కింగ్‌ కోబ్రాలను తీసుకొచ్చారు.

జంతు మార్పిడి కింద తీసుకువచ్చినవి ఇవీ..   
►రాజ్‌కోట్‌ జంతు ప్రదర్శనశాలకు చెందిన ఆసియా జాతి సింహం ఆడ బదులుగా మగ ఆసియాటిక్‌ సింహం ఆగస్టులో వచ్చింది.   
►రెండు జతల అడవి కుక్కలు, కొండ చిలువలు 2 జతలు  మంగళూర్‌ బయోలాజికల్‌ పార్క్‌ నుంచి తీసుకువచ్చారు. వీటికి బదులుగా ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను జూ పార్కు నుంచి ఇచ్చారు. పెద్ద ఎగ్రెట్‌ 3 మగ , 3 ఆడ, గ్రే పెలికాన్‌ 1 మగ,  1 ఆడ మంగళూర్‌ పిలికుల జూకు అందజేశారు.  
►త్రివేండ్రం జూ నుంచి సౌత్‌ అమెరికా వైట్‌ రియా 2 జతలు, బ్రౌన్‌ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి, జత ఎలుగుబంటి, తొండ జాతి ఇగ్వానా సెంట్రల్‌ అమెరికన్‌ జత వచ్చే జనవరిలో జూకు వచ్చే అవకాశం ఉంది 
►జపాన్‌లోని ఓకోహామా జూ నుంచి ఒక జత బూడిద రంగు కంగారూ, 1 జత మీర్‌ క్యాట్‌ జూకు రానున్నాయి. బదులుగా 1 ఆడ ఆసియా సింహాన్ని ఇస్తారు.  

దత్తత తీసుకోవడం హర్షణీయం
జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని యోకోహామా జూపార్కు నుంచి నెహ్రూ జూపార్కుకు జత కంగారూలు రెండు నెలల్లో రానున్నాయి. కంగారులు జూకు వచ్చిన తర్వాత ఏడాది అనంతరం వాటిని దత్తత తీసుకుంటామని పలు కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు కూడా ముందుకు రావడం సంతోషకర విషయం. రానున్న రోజుల్లో జంతు మార్పిడిలో భాగంగా దేశంలోని ఇతర జూల నుంచి కూడా జంతువులు రానున్నాయి. నగర జూ నుంచి కూడా కొన్ని వన్యప్రాణులు బదులుగా ఇస్తాం.  
– రాజశేఖర్, నెహ్రూ జూ పార్క్‌ క్యూరేటర్‌   

చదవండి: 2 రోజుల కోవిడ్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు!

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top