కేయూలో ఆంగ్ల శిక్షణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

కేయూలో ఆంగ్ల శిక్షణ తరగతులు

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

డిసెంబర్‌ 9 వరకు తరగతులు..

20 రోజులు తరగతులకు హాజరుకావాల్సిందే

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని అన్ని పీజీ నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు ఈవిద్యాసంవత్సరం (2026–2027 )నుంచి ఆంగ్లంలో శిక్షణ తరగతులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పీజీ విద్యార్థులకు ఆంగ్ల భాషవ్యక్తీకరణ, నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ తరగుతులను (సెల్ట్‌)ను ప్రవేశపెట్టారు. అన్ని పీజీ నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు రెండు క్రెడిట్లు తప్పనిసరి కోర్సుగా అమలుచేయాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. వి ద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు ఉండాలనే ఉద్దేశంతో వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవతీసుకొని దీని అమలుకు ఉపక్రమించారు. ఈకో ర్సు ద్వారా విద్యార్థులు వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆచరణాత్మక ఆంగ్ల భాష వినియోగం, సంభాషణ నైపుణ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కోర్సును మొదట ఈ విద్యాసంవత్సరం పీజీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకే వర్తింపచేయబోతున్నారు.

సైన్స్‌ విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌, హ్యూమనిటీస్‌, సోషల్‌ సైన్స్‌కోర్సులకు రెండో సెమిస్టర్‌లో..

కాకతీయ యూనివర్సిటీలో సైన్స్‌కోర్సుల విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌లోనే ఆంగ్ల భాషా నైపుణ్యాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. హ్యూమనిటీస్‌, సోషల్‌ సైన్స్‌స్‌ విద్యార్థులకు రెండో సెమిస్టర్‌లో ఈశిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఆయా విద్యార్థులు ఈ తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. నిర్దేశించిన విద్యాపరమైన ప్రమాణాలను పూర్తిచేయాలి.

పరీక్ష విధానం, మూల్యాంకనం

శిక్షణ తరగతులకు హాజరైన విద్యార్థులకు పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సెమిస్టర్‌ చివరిలో 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 40 మార్కులు బాహ్య పరీక్షకు (ఎక్స్‌టర్నల్‌ అసెస్‌మెంట్‌), 10 మార్కులు అంతర్గత పరీక్ష మూల్యాంకనానికి కేటాయించారు. విద్యార్థులు తరగతులకు హాజరు, చురుకై న ఆంగ్లభాషలో సంభాషణ, పరస్పర సంభాషణ, అభ్యసన పురోగతి తదితర అంశాల ఆధారంగా అంతర్గత మూల్యాంకనం నిర్వహిస్తారు. తుది పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభను కూడా పరిగణనలోనికి తీసుకొని విశ్వవిద్యాలయం నిర్దేశించిన విధానంలో ఫలితాలను ప్రకటిస్తారు.

కాకతీయ యూనివర్సిటీలోని ఇంగ్లిష్‌ విభాగంలో ఈ సెల్ట్‌ తరగతులను ఈనెల 16 నుంచి ప్రారంభించారు. డిసెంబర్‌ 9 వరకు తరగతులు కొనసాగుతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4–30 గంటలవరకు ఒక బ్యాచ్‌, సాయంత్రం 4–30 గంటల నుంచి 6 గంటలవరకు మరో బ్యాచ్‌కు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌, బాటనీ, ఫిజిక్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల విద్యార్థులకు రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహిస్తున్నాం. పీజీ విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలతోపాటు సమర్థవంతంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించేలా తరగతులు ఉంటాయి. విషయ నిపుణులతో శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నాం. విద్యార్థుల్లో విద్యాప్రగతి, ఉపాధి అవకాశాలు, వృత్తిపరమైన ఆత్మవిశ్వాసం సామాజిక పరివర్తన సంబంధాలను మెరుగుపరచడమే ఈ సెల్ట్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

– డాక్టర్‌ మేఘనరావు, సెల్ట్‌ డైరెక్టర్‌

పీజీ విద్యార్థులకు రెండు క్రెడిట్ల

కోర్సుగా అమలు

ఈ విద్యాసంవత్సరం నుంచే

అమలు

పీజీ కోర్సుల విద్యార్థులు ఈ 20 రోజుల శిక్షణ తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికి కూడా మినహాయింపు ఉండదు. హాజరు, అంతర్గత మూల్యాంకనం, బాహ్యపరీక్షకు సంబంధించిన అన్ని నిర్దేశిత ప్రమాణాలను పూర్తిచేయడం తప్పనిసరి. సెల్ట్‌ కోర్సు ఫలితాలను సంబంధిత సెమిస్టర్‌లోని ఇతర సబ్జెక్టుల ఫలితాలతోపాటు ప్రకటిస్తారు. ఈకోర్సు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నిర్దేశించిన ఉత్తీర్ణత మార్కులు సాధించని విద్యార్థులను ఆ సెమిస్టర్‌లో ఉత్తీర్ణుడిగా పరిగణించరు. ఈసెల్ట్‌ కోర్సు మార్కులకు సెమిస్టర్‌ మొత్తం శాతంలో వెయిటేజ్‌ ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement