రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ చోరీకి రెండేళ్లు
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ చోరీ కేసులో భారీగా బంగా రం రికవరీ లేకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. 2024 నవంబర్ 18 అర్ధరాత్రి గ్యాస్ కట్టర్లతో స్ట్రాంగ్‌రూంను కత్తిరించి, సీసీ కెమెరాల డీవీఆర్‌ను సైతం ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠా.. 474 మంది ఖాతాదారులకు చెందిన 19 కిలోల బంగారు ఆభరణాలను (రూ.13.61 కోట్ల విలువ) అపహరించింది. ఈ ఘటనకు రెండేళ్లు పూర్తయినా..ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ 86.74 శాతం సొత్తు ఆచూకీ మిస్టరీగానే మిగిలింది.
ఏడాదిన్నర పాటు వేట.. 8 మంది అరెస్టు
గూగుల్ మ్యాప్స్ ఆధారంగా మారుమూల బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా.. పోలీస్‌స్టేషన్‌న్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న రాయపర్తి ఎస్బీఐలో పక్కా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు టోల్గేట్ల సీసీ కెమెరాలు, ఫోన్‌న్‌పే చెల్లింపుల ఆధారంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన 8 మందిని అరెస్టు చేశారు. 2024 డిసెంబర్లో ఆర్షద్ అన్సారీ, భోలేఖాన, హిమాంశు, ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్‌ను, 2025 ఫిబ్రవరిలో సాగర్ గోరేను పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య అక్షయ్ అంబోర్ నేపాల్‌కు పారిపోయినట్లు భావించిన మహమ్మద్ సాజిద్ అలీఖానన్, అనికేత్ పాటిల్‌ను అరెస్టు చేశారు. వీరందరిపై 2026 జూలై 25న న్యాయస్థానంలో చార్జిషీట్ సైతం దాఖలైంది. 2024 డిసెంబర్ 21న ఈ చోరీకి సూత్రధారి అయిన మహమ్మద్ నవాబ్ హుస్సేన్ అరెస్టయ్యాడు. విచారణ క్రమంలో 10 కిలోలకు పైగా బంగారం తన తమ్ముడు సాజిద్ ఖాన్ వద్ద ఉందని చెప్పాడు. సాజిద్‌ఖాన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 22న అరెస్టు చేశారు. బంగారం రికవరీ ఏమీ కాలేదు.
పరిహారం అందినా... తీరని ఆవేదన
తాకట్టు ఆభరణాలకు బీమా రక్షణ ఉండడంతో బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే ఖాతాదారులకు ఇన్సూరెన్స్ చెల్లించింది. అయితే, పెళ్లి నాటి తాళిబొ ట్లు, తల్లిదండ్రుల జ్ఞాపకాలుగా ఉన్న పురాతన నగలను డబ్బుతో భర్తీ చేయలేమని బాధితులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు నాటి ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడంతో అందిన పరిహారంతో ఇప్పుడు అంతే బరువున్న నగలు కొనలేకపోతున్నామని వాపోతున్నారు. సాంకేతిక కారణాలతో మరికొందరి క్లెయిమ్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మిగిలిన సొత్తు రికవరీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
8 మంది అరెస్టయినా
ఇప్పటివరకూ దొరకని సొత్తు
19 కిలోల బంగారంలో
2.520 కిలోలు మాత్రమే రికవరీ
చోరీ జరిగినా 20 రోజుల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 2.520 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నదే. మిగిలిన 16.480 కిలోల ఆభరణాలు ఎక్కడికి చేరాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముంబై, బదౌన్ప్రాంతాల్లోని వ్యాపారులకు బంగారాన్ని విక్రయించారా? లేక కరిగించి రూపు మార్చారా? అన్న కోణంలో రికవరీ ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ఘటన జరిగిన నాడు బ్యాంకులో సెక్యూరిటీ గార్డు లేకపోవడం, అలారం పనిచేయకపోవడం వంటి భద్రతా లోపాలపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం భద్రత వ్యవస్థను పటిష్టం చేసి సెక్యూరిటీ గార్డును నియమించారు.


