ఖిలా వరంగల్ : చిట్టీ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారంటూ ఓ చిట్‌ఫండ్ సంస్థ నిర్వాహకులపై బాధితుడు కరీమాబాబాద్ బిహార్ నగర్‌కు చెందిన పెంచాల రాజు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ సంస్థ చైర్మన్ సుధాకర్, డైరెక్టర్ జనార్దన్‌పై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. పెంచాల రాజు 2019లో సదరు చిట్‌ఫండ్ సంస్థలో రూ.10 లక్షల చిట్టీలో చేరాడు. నెలనెలా 50 నెలల పాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాడు. 2023లో చిట్టీ గడువు పూర్తయినప్పటికీ తనకు రావాల్సిన రూ.9.80 లక్షలను సంస్థ నిర్వాహకులు తిరిగి చెల్లించలేదు. పలుమార్లు డబ్బులు కోసం అడిగినా స్పందించకపోవడంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ స్వామి బుధవారం తెలిపారు.
ఉత్సాహంగా పాఠశాల
క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్–14,17 బాలబాలిక విభాగాల్లో జిమ్నాస్టిక్స్, సాఫ్ట్ టెన్నిస్, చెస్, నెట్‌బాల్ ఎంపికలు నిర్వహించగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 650 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు హనుమకొండ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు, ఆయా క్రీడా సంఘాల బాధ్యులు కిరణ్, రమేశ్, శ్రీలత, వెంకటేశ్వర్లు, దేవేందర్, సురేశ్, కిషన్, వినయ్, రాణి, నరేందర్, హరీశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ మీదుగా
వన్‌వే స్పెషల్ ట్రైన్స్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్ మీదుగా ఈ నెల 19, 20వ తేదీల్లో దానాపూర్–బెంగళూరు కాంట్ మధ్య అప్ అండ్ డౌన్ రూట్‌లో రెండు రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల సమయ వివరాలు..
గురువారం దానాపూర్‌లో బయలుదేరే దానాపూర్–బెంగళూరు కాంట్ (03241) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా శుక్రవారం దానాపూర్‌లో బయలుదేరే దానాపూర్ –బెంగళూర్ కాంట్ (03245) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో ఈ రైళ్లకు అప్ అండ్ డౌన్‌లో రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడలో హాల్టింగ్ కల్పించారు.
అప్పుల బాధతో
దంపతుల ఆత్మహత్య
ఎక్స్‌వేదికగా డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర విచారం
ఖిలా వరంగల్: వరంగల్ రంగశాయిపేటలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రూ.50 వేలు అప్పుగా తీసుకోగా..రూ.10 వేలు వారానికి, వడ్డీ రూ.750 చెల్లించలేక ప్రాణాలు తీసుకోవడం కలచివేసిందన్నారు. తమ పెంపుడు కుక్కను కూడా చంపడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. గేమింగ్ యాప్‌లకు బానిసై అప్పులపాలవుతున్న పోలీసు సిబ్బందితోనూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సమస్యలను ఆత్మహత్యతో కాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని బుధవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో డీజీపీ పిలుపునిచ్చారు.


