హన్మకొండ: సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ నిర్మాణంపై సీఎం ఎ.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కేవలం 33 ఎకరాల భూసేకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రాజెక్టు అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత కోసం ఏడు టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో నిర్మించిన సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలిసి భూసేకరణ అంశంపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టును కొత్తగా నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలపై సీఎం రేవంత్‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. ఈనెల 22న హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న జన చైతన్య సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. మేధావులు, ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరనున్నారన్నారు. వారి పేర్లు బహిరంగ సభఽకు ఒక రోజు ముందు వెల్లడించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్ నన్నపునేని నరేందర్, నాయకులు మర్రి యాదవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్


