● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: గురుకుల విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈమేరకు వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని మహాత్మాజ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న వైద్యసేవలు, పౌష్టికాహారం నాణ్యత, వసతులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం ఎంతో ఆవసరమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ ముచ్చటిస్తూ చలికాలంలో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గురుకులంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదుల పెట్టె ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి పుష్పలతరెడ్డి, ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, విద్యార్థినులు పాల్గొన్నారు. అదేవిధంగా వరంగల్ మండలం కొత్తపేటలో చేపట్టిన యంగ్ ఇండియా స్కూల్ భవన పనులను గురువారం ఆమె పరిశీలించారు.


