● సమీక్షా సమావేశంలో కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: చిత్తడి నేలల సరిహద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నిఖితతో కలిసి చిత్తడి నేలల గుర్తింపు సరిహద్దుల నిర్దారణ నోటిఫికేషన్ ప్రక్రియపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ మెమోకు అనుగుణంగా జిల్లాలోని నేలల సరిహద్దులను భౌతికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అట్లాస్ ద్వారా గుర్తించిన చిత్తడి నేలలు నీటి వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, వై.వీ.గణేష్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భూ రీసర్వే పురోగతిపై సమీక్ష
జిల్లాలో భూభారతి భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ సర్వే పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్పష్టమైన కార్యాచరణతో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రీసర్వేలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.


