ఖిలా వరంగల్ : బియ్యం కొనుగోలు ధరలపై వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని.. అధిక ధరకు బియ్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిష్టయ్య తెలిపారు. బియ్యం ధరలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఆయన మాటల్లో..
దాడులు
చేస్తున్నాం..
ప్రతి రోజు బియ్యం విక్రయించే దుకాణాలను పౌర సరఫరాల శాఖ డిప్యూ టీ తహసీల్దార్‌తోపాటు తాము స్వయంగా తనిఖీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటున్నాం. షాపుల ఎదుట ధరల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నాం. దీంతో షాపుల్లో సన్నరకం బియ్యం ధరలు దిగి వచ్చాయి.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయాలు
బీపీటీ/కేఎన్‌ఎం రకం రూ.66, ఆర్‌ఎన్‌ఆర్ /తెలంగాణ సోనా మసూరి రూ.74, హెచ్‌ఎంటీ/ జేఎస్ ఆర్ రూ.79ల ధరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో సైతం ఇవే ధరలకు విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.
కేసులు నమోదు చేస్తున్నాం..
జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో ఆకస్మికంగా దాడులు చేస్తున్నాం. నిబంధనలు పాటించని షాపులపై కేసులు నమోదు చేస్తున్నాం. దుకాణాదారుల వద్ద ట్రేడ్ లైసెన్సు, జీఎస్టీ, ఆహార భద్రత లైసెన్సు లేకపోవడంతో చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. లీగల్ మెట్రాలాజీ శాఖాధికారులతో కలిసి తూకంలో మోసాలు చేస్తున్న షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధించారని డీఎస్‌ఓ కిష్టయ్య తెలిపారు.
ప్రభుత్వ నిర్ణీత ధరలకే విక్రయాలు
వరంగల్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిష్టయ్య


