ఇక.. ఇందిరమ్మ టవర్స్‌! | - | Sakshi
Sakshi News home page

ఇక.. ఇందిరమ్మ టవర్స్‌!

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

ఇక.. ఇందిరమ్మ టవర్స్‌! గ్రేటర్‌ వరంగల్‌కు 960 ఇళ్లు మంజూరు ?

ఎదురుచూపులకు తెరపడేనా

గ్రేటర్‌ వరంగల్‌కు 960 ఇళ్లు మంజూరు

● హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెరో 480 యూనిట్లు

● జీ+5 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు..

● అర్హుల ఎంపికకు డిమాండ్‌ సర్వే.. లాటరీ పద్ధతిలో కేటాయింపు

● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి వీపీ గౌతమ్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ఓరుగల్లు నగరంలో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టణ ప్రాంతాల్లో గృహ వసతి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ పథకంలో గ్రేటర్‌ వరంగల్‌కు 960 ఇళ్లను కేటాయించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెరో 480 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) వీపీ గౌతం శుక్రవారం జీవో ఆర్‌టీ నంబర్‌ 579 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్ల నిర్మాణం చేపట్టి అర్హులైన కుటుంబాలకు అందించనున్నారు.

ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయం

నగరాల్లో పెరుగుతున్న జనాభా, ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జీ+5 విధానంలో అపార్ట్‌మెంట్‌ బ్లాకులు నిర్మించనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల్లో ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూములను గుర్తించి నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేయనున్నారు. వరంగల్‌, హనుమకొండతో పాటు నిజామాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ పట్టణాలకూ ఈ పథకాన్ని విస్తరించారు. కాగా, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద ఒక్కో యూనిట్‌కు రూ.8.50 లక్షల వ్యయాన్ని అంచనా వేశారు. ఇందులో అర్హులైన ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ కుటుంబాలకు ఒక్కో ఇంటిపై రూ.5 లక్షల సబ్సిడీ అందించనున్నారు. లబ్ధిదారుల వాటా కింద గరిష్టంగా రూ.3.50 లక్షల వరకు వసూలు చేసేందుకు అనుమతిచ్చారు. ఈ మొత్తంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అర్హులకు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

భూముల గుర్తింపుపై కసరత్తు

ఇళ్ల కేటాయింపునకు ముందుగా నగరం, ప్రాంతాల వారీగా డిమాండ్‌ సర్వే నిర్వహించనున్నారు. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హతలను పరిశీలించి, క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం లాటరీ విధానంలో అర్హులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, అర్హతల నిబంధనలు, ఎంపిక ప్రక్రియపై తదుపరి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. కాగా, టవర్ల నిర్మాణానికి అవసరమైన భూములు గుర్తించి హౌసింగ్‌ బోర్డుకు అప్పగించే బాధ్యతను సంబంధిత కలెక్టర్లకు అప్పగించారు. మున్సిపల్‌, ప్లానింగ్‌ అధికారులు భూముల ఎంపిక, నిర్మాణ అనుమతులు, ఇతర చట్టపరమైన ప్రక్రియల్లో సహకరించా లని ప్రభుత్వం సూచించింది. స్థలాల గుర్తింపు పూ ర్తయితేనే నిర్మాణాలకు మార్గం సుగమం కానుంది.

గ్రేటర్‌ వరంగల్‌లో 960 ఇళ్ల కేటాయింపుతో సొంతిల్లు లేని పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఎక్కడ నిర్మిస్తారు? ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు? దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు? అర్హతల ప్రాతిపదిక ఏంటి? అన్న ప్రశ్నలు నగరవాసుల్లో నెలకొన్నాయి. కేటాయింపునకు అనుగుణంగా భూముల గుర్తింపు, నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement