రూ.4 కోట్లు.. 1,200 మందికి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రూ.4 కోట్లు.. 1,200 మందికి శిక్షణ

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

రూ.4 కోట్లు.. 1,200 మందికి శిక్షణ ప్రై‘వేటు’కు రంగం సిద్ధం! నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

కాజీపేట అర్బన్‌: రూ.4 కోట్లతో 1,200 మంది నిరుద్యోగ యువతకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను నిట్‌ వరంగల్‌ సాధించినట్లు నిట్‌ యాజమాన్యం శుక్రవారం తెలిపింది. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) ప్రాజెక్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంట్రపెన్యూర్‌షిప్‌ (ఎంఎస్‌డీఈ) సౌజన్యంతో 1200 మంది నిరుద్యోగ యువతకు రూ.4 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ ద్వారా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), వెబ్‌ డిజైనింగ్‌, ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల నైపుణ్య శిక్షణ అందించనున్నారు. పరిశ్రమలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణను 2027 మార్చిలోపు పూర్తి చేసి పరిశ్రమలకు నిష్ణాతులను అందించనున్నారు. పీఎంకేవీవై ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌గా నిట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శంకర్‌ను ఎంపిక చేశారు. త్వరలో నిరుద్యోగ యువత ఎంపిక విధానం, నైపుణ్య శిక్షణ వివరాలు వెల్ల డించనున్నారు.

కాజీపేట అర్బన్‌: రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మధ్యవర్తులు, ప్రైవేట్‌ వ్యక్తుల పెత్తనం లేకుండా చేసేందుకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లతో శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అనధికారంగా చెలామణీ అవుతున్న ప్రైవేట్‌ వ్యక్తులపై వేటు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పనితీరు, సిబ్బంది తప్పకుండా ఐడీ కార్డులు ధరించడం, ఆఫీస్‌ సబార్డినేటర్లు తెల్లని యునిఫాం, ప్రతీ రోజు ఉద్యోగి హాజరుతోపాటు క్యాష్‌ రిజిస్టర్‌ మెయింటెయిన్‌ చేయడం వంటి పలు అంశాలపై చర్చించి సబ్‌ రిజిస్ట్రార్లకు సూచనలు చేశారు. త్వరలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఈ మార్పునకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

హన్మకొండ అర్బన్‌: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన కొండపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేంద్రంలోని వివిధ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌లో మందుల నిల్వలు, పంపిణీ రికార్డులు తనిఖీ చేశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కేంద్రంలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు, సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్‌పీవీ టీకాలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, టీబీ ముక్త్‌ భారత్‌, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement