కేయూలో తైక్వాండో జట్ల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

కేయూలో తైక్వాండో జట్ల ఎంపికలు

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

కేయూలో తైక్వాండో జట్ల ఎంపికలు నేడు డయల్‌ యువర్‌ డీఎం సమస్యల పరిష్కారానికి పోరాడాలి మక్క క్వింటాకు రూ.3,290 రికార్డు ధర బీసీ లా గ్రాడ్యుయేట్స్‌కు శిక్షణ

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులకు అంతర్‌ కళాశాలల తైక్వాండో పోటీలను శుక్రవారం కేయూలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. స్పోర్ట్స్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఆరుగురు, మహిళల విభాగం నుంచి నలుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషుల జట్టును రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్లోబల్‌ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ టి.శాస్త్రి, ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ కుమార్‌ తెలిపారు. మహిళల జట్టు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న శారదా యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ తైక్వాండో పోటీల్లో పాల్గొంటుందని వారు పేర్కొన్నారు.

హన్మకొండ: ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి నేడు (శనివారం) డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న హనుమకొండలోని వరంగల్‌–1 డిపో నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్‌ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలందించాలని కోరారు.

విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సన్నద్ధం కావాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన హనుమకొండ, వరంగల్‌ జిల్లాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్‌ డీఏలు, వివిధ బిల్లులను విడుదల చేయాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్‌, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌.రవీందర్‌రాజు, తాటికాయల కుమార్‌, పెండెం రాజు, సి.సుజన్‌ప్రసాద్‌రావు, బాధ్యులు రాజారాం, శ్రీనివాస్‌, ఎస్‌ఏ రవూఫ్‌, లింగారావు, మల్లిక్‌, గిరిధరచారి, శ్రీనివాస్‌, రవీందర్‌, విజయ్‌ పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో శుక్రవారం మొక్కజొన్నకు రికార్డు ధర పలికింది. క్వింటాకు గరిష్టంగా రూ.3,290 ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2.410 ఉండగా, వ్యాపారుల మధ్య పోటీతో అధిక ధర లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

న్యూశాయంపేట: 2026–27 సంవత్సరానికి గాను అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌లో శిక్షణ పొందడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన లా గ్రాడ్యుయేట్స్‌ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఉప సంచాలకులు పుష్పలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను నవంబర్‌ 15వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండ లష్కర్‌ బజార్‌లోని బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement