హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి కృషి

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: పుట్టబోయే ప్రతీ బిడ్డకు హెచ్‌ఐవీ వైరస్‌ సోకకుండా నివారించి, హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడమే లక్ష్యమని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. గర్భిణులకు గర్భధారణ ప్రారంభ దశలోనే హెచ్‌ఐవీ, సిఫిలిస్‌, హెపటైటిస్‌ బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన సమ్మాన్‌–సమారోహ్‌, ఈవీటీఎస్‌ క్లినికల్‌ ఆడిట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ, గర్భిణులకు నిర్వహిస్తున్న పరీక్షలు, చికిత్సా విధానాలు, తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం నిర్దేశించిన 95–95–95 లక్ష్యాల సాధనకు వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిల్లాలో 10,296 గర్భిణులకు పరీక్షలు..

జిల్లాలో ఈఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు సుమారు 10,296 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఎయిడ్స్‌ నియంత్రణలో భాగంగా జిల్లాను సురక్ష జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన వైద్యాధికారులకు కలెక్టర్‌ జ్ఞాపికలు అందించి అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శేషాద్రి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మదన్మోహన్‌ రావు, ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ అధికారి జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

108 సేవలపై అవగాహన పెంచాలి

108 సేవలపై అవగాహన పెంచాలని, రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్‌ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు. శుక్రవారం తెలంగాణ 108 జీవీకే ఈఎంఆర్‌ఐ రాష్ట్ర ఆపరేషన్స్‌ అధికారులు సుధాకర్‌ బాతాల, విజయ్‌ కుమార్‌, పాటి శివకుమార్‌.. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పీఎం రహత్‌ పథకం ద్వారా అందించే వైద్య సహాయంపై చర్చించారు. ప్రమాద బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అర్హులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ 108 జిల్లా మేనేజర్‌ మండ శ్రీనివాస్‌, వరంగల్‌ జిల్లా మేనేజర్‌ గుర్రపు భరత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

భూసేకరణకు రైతులు సహకరించాలి

పరకాల పరిధిలో ఎన్‌హెచ్‌–163జీ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దామెర, శాయంపేట, పరకాల మండలాల పరిధి పలు గ్రామాల రైతులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ వరంగల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ భరద్వాజ్‌, మేనేజర్‌ లింగయ్య, పరకాల ఆర్డీఓ డీఎస్‌.వెంకన్న, తహసీల్దార్లు ప్రవీణ్‌కుమార్‌, జ్యోతి వరలక్ష్మీదేవి, విజయలక్ష్మి, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement