వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత తప్పదని కమిషనర్ టి. వెంకన్న కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తయిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధిలోని కాశిబుగ్గ సర్కిల్, పోతరాజుపల్లి, ఉర్సు, తోట మైదానం, గిర్మాజీపేట, చార్‌బౌళి, లక్ష్మీపురం మార్కెట్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల పనులు, వరంగల్ చౌరస్తా వద్ద చేపట్టిన పైప్‌లైన్ పనులను తనిఖీ చేశారు. కాజీపేట సర్కిల్ పరిధిలోని బంధం చెరువు, కాజీపేట దర్గా సమీపంలో, పిస్తా హౌస్ ప్రాంతాల్లో చేపట్టిన పనులతోపాటు శాయంపేటలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ, ఉర్సు వద్ద నిర్మిస్తున్న యూపీహెచ్సీ భవనాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. శాయంపేటలో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసి స్థానికులతో మాట్లాడారు. స్వచ్ఛ ఆటో రోజూ వస్తుందా.. చెత్త సేకరిస్తుందా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట ఈఈలు సంజయ్‌కుమార్, రవికుమార్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న


