‘మురుగు’కు పరిష్కారం! | - | Sakshi
Sakshi News home page

‘మురుగు’కు పరిష్కారం!

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

‘మురుగు’కు పరిష్కారం!

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌–2.0 కింద ప్రభుత్వం పలు పనులు నిర్వహించనుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధి ఐదు మున్సిపాలిటీ (పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట)ల్లో మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుల కోసం పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖ టెండర్‌ నోటీసు జారీ చేసింది. ఈ ఐదు పట్టణాలకు రూ.83.30 కోట్ల మూలధన ప్రాజెక్టు వ్యయాన్ని బిడ్‌ డాక్యుమెంట్‌లో పొందుపర్చారు. వీటిలో మురుగునీటి శుద్ధి, మురుగునీటి వ్యవస్థల నిర్మాణం ఈ ప్రాజెక్టు ఉద్దేశంగా పేర్కొన్నారు.

హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో టెండర్లు

ఈ పనులను హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) విధానంలో చేపట్టనున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారులు పేర్కొన్నారు. ఇందులో ప్రారంభ చెల్లింపులు, వాయిదాల రూపంలో తదుపరి చెల్లింపులు, నిర్వహణ వ్యయాలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చిన తర్వాత ఒప్పంద నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు), అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్మాణం, యంత్ర పరికరాల ఏర్పాటు, పరీక్షలు, ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావడం వంటి పనులు ఉన్నాయి. శుద్ధి చేసిన నీటిని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితంగా విడుదల చేసేలా వ్యవస్థలను రూపొందించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఆర్‌ టెక్నాలజీతో ఎస్‌టీపీలు..

ఎస్‌టీపీల నిర్మాణానికి ఎస్‌బీఆర్‌ (సీక్వెన్సింగ్‌ బ్యాచ్‌ రియాక్టర్‌) సాంకేతికతను ఉపయోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్మాణానికి ముందు స్థల పరిశీలన, సర్వే, టోపోగ్రాఫిక్‌ మ్యాప్‌, కాంటూర్‌ మ్యాప్‌ తయారీ, ప్లాంట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగుల పరిశీలన, అనుమతులు తప్పనిసరి. పనులు పొందిన కాంట్రాక్టర్లు ప్రారంభమైన తర్వాత మొత్తం ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు పెట్టారు. ప్లాంట్లను ప్రారంభించిన అనంతరం ఐదేళ్లపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ (ఓఅండ్‌ఎం) నిర్వహించాల్సి ఉంటుంది. మురుగునీటి వ్యవస్థలు నిర్మించి వదిలేయకుండా.. వాటి పనితీరును పర్యవేక్షించడం, యంత్రాల నిర్వహణ, శుద్ధి ప్రమాణాలను పాటించడం, మరమ్మతులు చేపట్టడం వంటి బాధ్యతలు కూడా ఈ విధానంలో కీలకం చేశామని పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే టెండర్‌లు ఖరారు చేసి పనులు మొదలు పెడతామని చెప్పారు.

ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో

రూ.83.30 కోట్ల పనులు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌–2.0 కింద నిధులు

పరకాల, భూపాలపల్లి, జనగామ,

వర్ధన్నపేట, నర్సంపేటకు చోటు

రెండేళ్లలో నిర్మాణం, ఐదేళ్ల నిర్వహణ..

పనుల ప్రారంభంపై ప్రజారోగ్యశాఖ కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement