లెక్కాపత్రం లేవట! | - | Sakshi
Sakshi News home page

లెక్కాపత్రం లేవట!

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

లెక్కాపత్రం లేవట!

బిల్లులు ఇలా తీసుకోవాలి..

కమిషనర్‌ ఆమోదపత్రం ఆధారంగా అసలు అడ్వాన్స్‌ నిధులను అధికారులు, సిబ్బంది తీసుకోవాలి.

● నిధుల ఖర్చు వివరాలు, బిల్లులు నెల రోజుల్లోగా సమర్పించాలి.

● ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలి. లేకుంటే సంబంధిత అధికారులు, సిబ్బంది జీతం నుంచి సొమ్మును రికవరీ చేయాలి.

● నెలకాకపోయినా కనీసం ఏడాదికోసారైనా నిధుల వ్యవహారాలపై ఆడిట్‌ తప్పనిసరిగా నిర్వహించాలి.

● కానీ, బల్దియాలో దశాబ్దాలుగా ఆడిట్‌ అభ్యంతరాలకు సంబంధించిన రూ.కోట్ల పద్దులకు లెక్కలు తేలడం లేదు.

వరంగల్‌ అర్బన్‌: ఇంట్లో రూ.వంద ఖర్చు పెట్టాలంటే పది సార్లు సరిచూసుకుంటాం.. వంద రూపాయలు తేడా వస్తే పదిసార్లు లెక్క పెడతాం. ఆ నగదు ఏమైందోనని తెగ ఆలోచిస్తాం. కానీ, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఖజానా నుంచి రూ.కోట్లు తరలిపోయినా కొందరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తీసుకున్న అడ్వాన్స్‌కు ఎటువంటి లెక్కలు చూపకుండా దశాబ్దాలుగా కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఆడిట్‌ దస్త్రాలకు లెక్కాపత్రం లేకుండా అభ్యంతరాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి.

2000 సంవత్సరం నుంచి అభ్యంతరాలు..

వరంగల్‌ మహానగరపాలక సంస్థ కార్యాలయంలో 2000 సంవత్సరం నుంచి ఆడిట్‌ అభ్యంతరాలున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం సుమారు రూ.50 కోట్లకు సంబంధించిన లెక్కలకు సరైన వివరాలు లేవు. రికవరీ, కేసులు అసలే లేవు. సాధారణంగా నిధుల వినియోగం, అభివృద్ధి పథకాలు, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, అడ్వాన్స్‌లు జమ, ఖర్చులపై ప్రతి ఏటా ఆడిట్‌ చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగం, రికార్డుల నిర్వహణ, చేసిన పనులకు బిల్లులు సక్రమంగా లేకపోవడం, అంచనాల్లో తేడాలు తదితర అంశాలపై ఆడిటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు వెంటనే అభ్యంతరాలపై సరైన వివరాలు సమర్పించాలి. కానీ, ఖర్చులకు లెక్కల్లేవు. ఉన్న లెక్కలకు వాస్తవాలకు పొంతనలేదు. ఒక ఏడాది పేరుతో మరో ఏడాది కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంస్థల పేరుతో నామినేషన్లపై బినామీలకు అప్పగిస్తారు. దళారులతో కుమ్మక్కవుతారు. నాణ్యతను పట్టించుకోరు. అసలు పనులు, సామగ్రి కొనుగోలు చేయకుండానే బిల్లులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొన్ని ఫైళ్లకు బూజు..

మరికొన్ని మాయం

అడ్వాన్స్‌లు తీసుకున్న అధికారులు, సిబ్బందిలో కొందరు ఉద్యోగ విరమణ పొందారు. డిప్యుటేషన్‌పై వచ్చిన వారు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. వీటికి సంబంధించిన కొన్ని రికార్డులు బూజు పట్టిపోతున్నాయి. కొలిక్కిరాని సొమ్ములో చాలా మేరకు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గణాంక శాఖ అధికారులు ప్రతీ ఏడాది నోటీసులు జారీ చేస్తున్నారు. లెక్కలను వెల్లడించి నివేదికను సమర్పించాలని హెచ్చరిస్తున్నారు. కాగా, అక్రమాలు ఎక్కడ వెలుగుచూస్తాయోనని ముందుగానే పసిగట్టి ఫైళ్లు మాయం చేశారనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిలో కొంతమంది చనిపోయారని, ఆడిట్‌ అభ్యంతరాలపై ఫైళ్లు లభించడం లేదని, ఏదో మొక్కుబడిగా మాట్లాడటం తప్ప వాస్తవాలు, లెక్కలు తేల్చే ఉద్దేశం ఏ అధికారిలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఆడిట్‌ అభ్యంతరాలపై వివరణ కోరగా ఉన్నతాధికారులు తమ పరిధిలో కాదని దాటవేస్తున్నారు.

జీడబ్ల్యూఎంసీలో పెద్దఎత్తున ఆడిట్‌ అభ్యంతరాలు

రూ.50 కోట్ల లెక్కల వివరాలు మాయం?

పాత ఫైళ్లు గల్లంతు.. రికవరీ,

బాధ్యులపై కేసులు అసలే లేవు

అధికారుల్లో జవాబుదారీతనం

కరువైందన్న విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement