కాజీపేట: పిల్లలపై జరిగే లైంగిక నేరాలపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, 18 ఏళ్లలోపు పిల్లలకు లైంగిక చర్యలకు సమ్మతి తెలిపే చట్టబద్ధమైన అర్హతలేదని రైల్వే కోర్టు ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ చెన్ను లీల నాగసుస్మిత అన్నారు. పిల్లల ఇష్టపూర్వకంగానే జరిగిందనే వాదనను పోక్సో చట్టం అంగీకరించదని పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కాజీపేట మండలం సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ పోక్సో చట్టం బాలికలతోపాటు బాలురకు కూడా సమానంగా వర్తిస్తుందన్నారు. చిన్నారులను ఎవరైనా వేధిస్తే వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో హెచ్‌ఎం కె.శ్యామల, బాలల రక్షణ అధికారి సంజీవ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం ఈ–వేస్ట్‌మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ–వ్యర్థాలను సేకరించనున్నారు. ఈ–వ్యర్థాలను ఏకీకృతం చేసి అధీకృత రీసైక్లర్లకు అప్పగించనున్నారు. పాఠశాలల్లోని ఏకోక్లబ్‌ల ద్వారా ఈ–వ్యర్థాలపై అవగాహన, సేకరణ బాధ్యతాయుతమైన నిర్మూలన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈమేరకు ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు డీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
హన్మకొండ అర్బన్: నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువలను పాటిస్తూ అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి, పౌరుడు కృషి చేయాలని ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ పి.సాంబయ్య పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా మంగళవారం హనుమకొండ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధకశాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, టీజీఓ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ మేన శ్రీను, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
హన్మకొండ: బాలల అక్రమ రవాణా నిర్మూలనకు ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ కె.వసుధ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో బాలల అక్రమ రవాణా నిర్మూలనపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ఆయా సంస్థల ప్రతినిధులు ఫాదర్ కోసి, డాక్టర్ అనితారెడ్డి, మండల పరశురాములు, మహబూబాబాద్ జిల్లా చైల్డ్ వెల్ఫే కమిటీ చైర్మన్ డాక్టర్ నాగవాణి, ఎఫ్‌ఎఫ్‌ఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, నవజీవన్ సంస్థ ప్రతినిధులు కరుణాకర్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని 14 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 29న ఓసిటీలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు నవంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ పీఎంశ్రీ పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.


