22–ఏ భూమికి మైనింగ్‌ పర్మిట్‌? | - | Sakshi
Sakshi News home page

22–ఏ భూమికి మైనింగ్‌ పర్మిట్‌?

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

22–ఏ భూమికి మైనింగ్‌ పర్మిట్‌?

● రెవెన్యూ రికార్డులో ఒకరి పేరు .. మైనింగ్‌ అనుమతి మరో వ్యక్తికి

● కొండపర్తి గ్రామంలో పీఓటీ యాక్ట్‌ కింద

నిషేధిత జాబితాలో సర్వేనంబర్‌ 1279/2

● 788 మెట్రిక్‌ టన్నుల గ్రావెల్‌ తరలింపునకు మైనింగ్‌శాఖ ఒకే..

● ఇప్పటికే భారీగా మట్టి తరలింపు..

● వెరిఫికేషన్‌, యాజమాన్య హక్కుల పరిశీలనపై అనుమానాలు?

ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో సర్వేనంబర్‌ 1279/2కు సంబంధించి రెవెన్యూ మైనింగ్‌ శాఖల రికార్డుల్లో కనిపిస్తున్న వివరాలు పలు కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డులో సర్వేనంబర్‌ 22–ఏ నిషేధిత జాబితాలో, పీఓటీ యాక్ట్‌–1977 కింద నమోదై ఉన్నట్లు కనిపిస్తుండగా .. మరోవైపు అదే సర్వేనంబర్‌ నుంచి 788 మెట్రిక్‌ టన్నుల గ్రావెల్‌ తరలించేందుకు మైనింగ్‌ శాఖ తాత్కాలిక పర్మిట్‌ జారీ చేసింది. అంతేకాకుండా రెవెన్యూ రికార్డులో కనిపిస్తున్న పేరు మైనింగ్‌ పర్మిట్‌లో ఉన్న పేరు వేర్వేరుగా ఉండటం అధికారులు కక్కుర్తి పడ్డారా? అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి తలొగ్గారా అనే సందేహాలు కలుగుతున్నాయి. సోమవారం గ్రామంనుంచి 20 ట్రిప్పర్ల ద్వారా మొరం తరలిపోతుండగా వే బిల్లులు లేకుండా, అసైన్డ్‌ భూమినుంచి మొరం ఎలా తరలిస్తారని స్థానికులు ప్రశ్నించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

మైనింగ్‌ శాఖ అనుమతి?

కొండపర్తి గ్రామంలోని సర్వేనంబర్‌ 1279/2లో 152 హెక్టార్లలో 788 మెట్రిక్‌ టన్నుల గ్రావెల్‌ను ఈనెల 28 నుంచి అక్టోబర్‌ 17 వరకు రహదారి ద్వారా తరలించేందుకు మైనింగ్‌ శాఖ ఓ వ్యక్తిపేర పర్మిట్‌ జారీ చేసింది. మైనింగ్‌శాఖ పర్మిట్‌ ఇచ్చే ముందు సంబంధిత భూమి హోదా, యాజమాన్య వివరాలు, 22–ఏ స్థితి, పీఓటీ యాక్ట్‌ వర్తింపు, దరఖాస్తుదారుడికి భూమిపై ఉన్న హక్కు, అవసరమైన రెవెన్యూ క్లియరెన్స్‌లు తదితరాలను అధికారులు ఎలా ధ్రువీకరించారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకే సర్వేనంబర్‌.. రెండు పేర్లు ఎందుకు?

రెవెన్యూ రికార్డుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో 1279/2 అసైన్డ్‌ భూమి కావడంతో నిషేధిత జాబితాలో ఒకరి పేరు మీద ఉండగా అదే సర్వేనంబర్‌కు సంబంధించి మైనింగ్‌ శాఖ గ్రావెల్‌ తరలింపునకు తాత్కాలిక పర్మిట్‌ మరో వ్యక్తి పేర జారీ చేసింది. పర్మిట్‌ పొందిన వ్యక్తికి సంబంధిత భూమిపై ఎలాంటి హక్కు ఉందో మైనింగ్‌శాఖ స్పష్టం చేయాల్సి ఉండగా అలాంటిదేమీ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం భూమిలేని పేదలకు షరతులతో కేటాయించిన అసైన్డ్‌ భూమి బదలాయింపు, రిజిస్ట్రేషన్‌ నిషేధమని తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌ యాక్ట్‌, 1977 స్పష్టం చేస్తోంది. రెవెన్యూ శాఖ 22–ఏ జాబితాలో సర్వేనంబర్‌ 1279/2 భూభారతి పోర్టల్‌లోనూ అధికారికంగా కనిపించడం గమనార్హం.

ల్యాండ్‌ స్టేటస్‌ వెరిఫికేషన్‌ ఎలా జరిగింది?

పట్టా భూమి హక్కు విషయాన్ని అధికారులు ఎలా పరిశీలించారు,.. రూల్‌ 9(4)కింద పర్మిట్‌ ఇచ్చేముందు జీఓ ఎంఎస్‌ నంబర్‌ 44 ప్రొసీజర్‌ ఫాలో అయ్యారా? భూమి యాజమాన్యం ఒకరి పేరుతో ఉండగా మైనింగ్‌ పర్మిట్‌ మరో వ్యక్తి పేరుతో ఎందుకు ఇచ్చారు? వ్యవసాయ యోగ్యమైన భూమి నుంచి మొరం తరలించడానికి ఏ అధికారి అనుమతి ఇచ్చారు? రెవెన్యూ ఎన్‌ఓసీ, తహసీల్దార్‌ నివేదిక, ల్యాండ్‌ క్లాసిఫికేషన్‌, 22–ఏ స్టేటస్‌ వెరిఫికేషన్‌, సర్వే ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌ తదితర అంశాలు మైనింగ్‌ శాఖ స్పష్టం చేయకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

టన్నుకు రూ.26 చొప్పున నామమాత్రపు రుసుము..

నామ మాత్రపు చార్జీలు సగటున టన్నుకు రూ.26 చొప్పున రుసుములు చెల్లించి లక్షల విలువ చేసే మొరం అక్రమ తరలింపునలో బడా నేతల హస్తంఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో టిప్పర్‌ మొరానికి రూ.7వేల నుంచి రూ.8 వేలు పలుకుతుండగా పర్మిట్‌ పొందినవారు ఎంత పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారో.. ప్రజాధనం ఎలా లూటీ అవుతుందో స్పష్టమవుతుందంటున్నారు. కలెక్టర్‌ స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌ను వివరణ కోరగా నాలుగు నెలల క్రితం కొండపర్తిలోని సర్వేనంబర్‌ 1279/2 భూమి ప్రభుత్వ అసైన్డ్‌ భూమిగా మైనింగ్‌ శాఖకు నివేదిక అందించామని తెలిపారు. మిగతా అనుమతులు తమ పరిధిలోకి రావని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement