సోషల్ మీడియాలోనూ
‘నేమ్ హంట్’..
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్న వేళ.. మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలి? అన్న దానిపై పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలనుంచి సూచనలు కోరడంతో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, నెటిజన్లు తమకు నచ్చిన పేర్లను సూచిస్తున్నారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు పేరు ఇప్పుడు ఓరుగల్లు చరిత్ర, కాకతీయుల వారసత్వం, తెలంగాణ సాంస్కతిక స్ఫూర్తి, ప్రముఖుల సేవల చుట్టూ తిరుగుతోంది. ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు నిర్మాణశైలి కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం సూచించడంతో ఓరుగల్లు సంస్కృతి, కాకతీయ కళావైభవం ప్రపంచానికి మరింత లోతుగా తెలిసే అవకాశం ఉంది.
తొలుత సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. వరంగల్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌ఐఏ)’లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కేఐఏ)’పేర్లను సూచించారు. ఓరుగల్లు వారసత్వం, సంస్కతి, చరిత్రకు తగిన పేరు ఉండాలని పేర్కొన్నారు. ఆయన సూచనపై సీఎం స్పందిస్తూ ‘దట్స్ ది స్పిరిట్’ అంటూ రియాక్ట్ అయ్యారు కూడా. ‘దసర’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో ప్రతిపాదన చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు ‘సమ్మక్క–సారలమ్మ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’అని పేరు పెట్టాలని సూచించారు. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా రాణి రుద్రమదేవి పేరును సూచించారు. ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్’అని పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. ఇదే సమయంలో నటుడు విజయ్ దేవరకొండ కూడా రుద్రమదేవి, కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లకు మద్దతుగా స్పందించారు. సినీ నటుడు నితిన్ కూడా బుధవారం ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’పేరును సూచించారు. దీంతో సినీ రంగం నుంచి రుద్రమదేవి పేరుకు వస్తున్న మద్దతులో మరో పేరు చేరింది. అదేవిధంగా పలు దళిత సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ చరిత్రకు అనుసంధానమైన పేరు ఉండాలని పలువురు నెటిజన్లు, పౌరులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు కూడా ప్రతిపాదనల్లోకి వచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సీఎం పిలుపునకు స్పందిస్తూ మా మునూరు ఎయిర్‌పోర్టుకు పీవీ పేరు పెట్టాలని సూ చించారు. ప్రస్తుత వరంగల్ ప్రాంతానికి చెందిన పీ వీ 1991–96 మధ్య ప్రధానమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక పీవీ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు మరికొందరు నా యకులు, ఆయన కుటుంబం/ట్రస్ట్‌కు సంబంధించిన వ ర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో పీవీ పేరు కూ డా ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటిగా మారింది. కాగా పేర్ల చర్చలో తాజాగా మరో ప్రతిపాదన చేరింది. ఎ ంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల 22న సీ ఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తూ వరంగల్ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ పేరు పెట్టాలని కోరారు. అలావుద్దీన్ 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వ్యతిరేక పో రాటంలో పాల్గొన్నారని, అనంతరం శిక్ష అనుభవించారని ఓవైసీ ఆ లేఖలో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో
‘మామునూర్’ హీట్
తెరపైకి రోజుకో పేరు..
రుద్రమ.. కాకతీయ.. సమ్మక్క–సారలమ్మ .. పీవీ.. అలావుద్దీన్.. అంబేడ్కర్!
నిర్మాణశైలిలో కాకతీయ
కళావైభవం, పరాక్రమం
ప్రతిబింబించాలన్న సీఎం
ఎవరికి వారుగా సామాజిక మాద్యమాల్లో ఆన్‌లైన్ పోల్ నిర్వహణ
సీఎం పిలుపుతో సోషల్ మీడియాలోనూ పేర్లపై చర్చ సాగుతోంది. కొందరు రాణి రుద్రమదేవి, మరికొందరు కాకతీయ, సమ్మక్క–సారలమ్మ పేర్లతో ఎయిర్‌పోర్టు గేట్లు, టెర్మినల్ డిజైన్లను ఏఐ ద్వారా రూపొందించి షేర్ చేస్తున్నారు. పీవీ నరసింహారావు, ఓరుగల్లు, ప్రతాపరుద్ర, ప్రొఫెసర్ జయశంకర్, సర్వాయిపాపన్నల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. మరోవైపు కొందరు ఆన్‌లైన్ వేదికగా పోల్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు, వివిధ వర్గాలు చేసిన సూచనలు మాత్రమే. తుది పేరు ఇంకా ఖరారు కాలేదు.


