ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో 2026–27 సీజన్ నూతన పత్తి కోనుగోళ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా నల్లబెల్లి మండలం యం.వి తండాకు చెందిన జి.రమణ పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. జెండాపాట నిర్వహించి తొలి పత్తి క్వింటాకు రూ.8,775 ధర నిర్ణయించారు. కొత్త సీజన్‌లో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మంచి ధర రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈసందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంకతోపాటు పాలకవర్గ సభ్యులను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి సన్మానించారు.
యార్డును పరిశీలించిన సీపీ శ్వేత
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్, శ్వేత శుక్రవారం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం మార్కెట్‌కు వచ్చే మిర్చి రకాల వివరాలతో పాటు వాటికి లభిస్తున్న ధరలపై చైర్‌పర్సన్ ఎర్రప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సీపీ ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల గురించి ఇన్‌స్పెక్టర్ జవ్వాజి సురేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, వైస్‌చైర్మన్ బండి జనార్దన్, కమిటీ సభ్యులు గజ్జల శ్యామ్, దుగ్యాల గోపాల్‌రావు, కందుకూరి పూర్నచందర్, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మడూరి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు, అధికారులు, ఎస్సై గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు
ఏనుమాముల మార్కెట్‌లో
ప్రారంభమైన సీజన్
క్వింటాకు రూ.8,775 పలికిన ధర


