హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల పరిశీలకుడు, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.శేషాద్రి, ఎన్నికల అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ల పరిశీలన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు.


