నేడు మంత్రి సీతక్క సమీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి సీతక్క సమీక్ష

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

హన్మకొండ అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండ ఐడీఓసీలో జరగనున్న ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నివారణ, ముందస్తు చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించనున్నారు. గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ, ఇతర భవనాల నిర్మాణ పనుల పురోగతి, పూర్తి స్థితి, పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అధికా రులు తమ శాఖల తాజా గణాంకాలు, పురోగతి నివేదికలు, పెండింగ్‌ పనుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని స్పెషల్‌ సీఎస్‌ దాన కిశోర్‌ ఆదేశించారు.

సాయి వర్ధినికీ

సీపీ అభినందనలు

హసన్‌పర్తి: ఇండియన్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ఎంపికై న క్రీడాకారిణి వేల్పుల సాయి వర్ధినిని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అభినందించారు. గురువారం హనుమకొండ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ తాబేటి రాజేందర్‌, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్‌ పోలేపాక వినయ్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ సీపీ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్‌ శ్వేత మాట్లాడుతూ.. ఇండియన్‌ జట్టుకు సాయివర్ధిని ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ప్రతినిధులు సాయివర్ధిని గురించి సీపీకి వివరించారు. అక్టోబర్‌ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైనాలో జరగనున్న ఆసియా కప్‌–2026 పోటీల్లో సాయివర్ధిని పాల్గొననున్నట్లు చెప్పారు. సీపీని కలిసిన వారిలో సాయి వర్ధిని తండ్రి అనిల్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులున్నారు.

ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు

హన్మకొండ అర్బన్‌: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై హనుమకొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ ఆకుల రాజేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగుల సమస్యలపై హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా రెండు డీఏలు విడుదల చేస్తామని, ఈనెలాఖరులోగా పీఆర్సీ నివేదిక తెప్పించుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని చెప్పారు. సీపీఎస్‌ రద్దు కోసం కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగుల ఇతర డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వీలైనంత త్వరగా మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, టీఎన్‌జీఓస్‌ ప్రధాన కార్యదర్శి, జేఏసీ సెక్రటరీ జనరల్‌ ఏలూరు శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి జిల్లా జేఏసీ పక్షాన ఆకుల రాజేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement