● దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్
కాజీపేట రూరల్ : కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీల మధ్య వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, రైల్వే కాలనీల నుంచి సేకరించిన మొత్తం 225 నీటి నమూనాలు వినియోగానికి సురక్షితమని నిర్ధారించినట్లు తెలిపారు. భూగర్భ జలం, పురపాలక నీటి సరఫరా, నిల్వు ఉన్న నీరు, క్లోరినేషన్ పంపిణీ వ్యవస్థలతో సహా మొత్తం నీటి సరఫరా ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిపారు. కాజీపేట రైల్వేస్టేషన్, కాలనీల్లో 149 సాధారణ నీటి నమూనాలను సేకరించి వాటిలో మిగిలిన క్లోరిన్ స్థాయిని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో 76 నీటి నమూనాలను సేకరించి వాటిలో మిగిలిన క్లోరిన్ స్థాయిపై పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జోన్ రైల్వేస్టేషన్లలో సరఫరా చేసే నీటి నాణ్యత ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, ప్రతీ ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని అధికారులు, సూపర్‌వైజర్లకు సూచించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మలా రాజారామ్ కాజీపేట రైల్వే స్టేషన్‌లో తాగునీటి నాణ్యత పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు.


