గార్ల: 2 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అప్పటి దాకా గడపదాటని ఆ ఇల్లాలికి కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. ఫలితంగా కూలీ, ఇతర పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఉన్నంతలో బతుకున్న ఈ తరుణంలో తన 14 ఏళ్ల బాలుడికి మాయదారి రోగం బ్లడ్ క్యాన్సర్ సోకింది. ఆ ఆపరేషన్ కోసం రూ.8 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిల్లిగవ్వ లేని పరిస్థతి. ఈ క్రమంలో దాతలు ఆపన్నహస్తం అందించి తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆ తల్లి వేడుకుంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాలోత్ కుమార్, కుమారి దంపతుల కుమారుడు రోహిత్ గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూ ల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలింది. బాలుడిని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లి కుమారి బాలుడిని హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స కోసం రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లి అంత డబ్బు లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంది. దాతలు ఆదుకుని తన కుమారుడికి ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటోంది. దయార్ధ్ర హృదయులు వారు మానవత్వంతో ఆలోచించి 73968 62419 నంబర్‌కు తమకు తోచిన మేర ఫోన్ పే చేసి తన కుమారుడు రోహిత్‌కు ప్రాణం కాపాడాలని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే, ప్రభుత్వం, అధికారులు స్పందించి వైద్యఖర్చులు భరించి బాలుడిని బతికించాలని తల్లి వేడుకుంటుంది.
దాతలను వేడుకుంటున్న చిన్నారి తల్లి
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోహిత్
ఆపరేషన్‌కు రూ.8 లక్షలు అవసరం
ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి


