కాశిబుగ్గ: వరంగల్‌లోని సీకేఎం ప్రసూతి వైద్యశాలలో పసికందులకు ఉపయోగించే పరికరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. నెలలోపు పసికందులు అనారోగ్యంతో బాధపడుతున్న తక్షణమే వైద్యసేవలు అందించాల్సిన పరికరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ బర్న్ వార్డులో ఆక్సిజన్ సమస్య, తక్కువ బరువు, శ్వాస అందని పరిస్థితిలో పసికందులకు సీ ప్యాప్ ద్వారా వైద్యసేవలు అందిస్తారు. ఈ పరికరం పనిచేయడం లేదని సమాచారం. అదేవిధంగా అవుట్ బర్న్‌లో కూడా పసికందులకు అవసరమైన రెండు ఫొటోథెరపీలు ఉండగా ఇందులో ఒకటి పనిచేయడం లేదని తెలిసింది. దీంతో జాండీస్ వచ్చిన పసికందుల వైద్యసేవలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఈ రెండు రకాల పరికరాలు చాలాకాలం నుంచి పనిచేయకున్నా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాట్లు చేసుకోవడం లేదని సమాచారం. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో షార్ట్ సర్యూట్ వల్ల ఐదుగురు చిన్నారులు మృతిచెందినా సీకేఎం అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


