హన్మకొండ/ఖిలావరంగల్: రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీలపై చార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు కోరారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు లావాదేవీల వ్యయాలు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. యూపీఐ చెల్లింపులపై డీలర్లకు ప్రత్యేక మినహాయింపు లేదా రాయితీ విధానం అమలు చేయాలని సూచించారు.


