2028 నాటికి విమానాల టేకాఫ్ లక్ష్యంగా ప్రాజెక్టు ముందుకు
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులవైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విడుదల చేసిన తాజా టెండర్ డాక్యుమెంట్, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు ఓరుగల్లు గగన విహారానికి సరికొత్త రూపురేఖలను అద్దనున్నాయి. ఇప్పటికే రూ.203.49 కోట్లతో రన్ వే ఆధునికీకరణ నుంచి టర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు టెండర్లు పిలిచిన ఏఏఐ...తాజాగా రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో నూతన డొమెస్టిక్ టర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కం టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈ అండ్ ఎం వర్క్‌షాప్ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు టెండర్లు పిలిచింది. ఇందుకు సంబంధించి ఈనెల 28న వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 3 వరకు బిడ్ల సమర్పణకు గడువు ఉంది. ఈ పనులను 18 నెలల కాలవ్యవధిలో పూర్తి చేయాలని గడువు విధించారు.
ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు ఇలా..
● కాకతీయ శైలిలో ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 949.44 ఎకరాల ఎయిర్‌పోర్ట్ ప్రణాళిక విస్తీర్ణాన్ని సిద్ధం చేశారు. ఎయిర్‌బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలతో పాటు భారీ కార్గో విమానాలు కూడా దిగేలా 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్‌వేను ఆధునికీకరిస్తున్నారు.
● ఫేజ్–1 కింద సుమారు 6,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న టర్మినల్ భవనం ద్వారా ఏటా 3.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించవచ్చు. లోపలి అలంకరణలో కాకతీయ తోరణం శైలిని, తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా శిల్పాలు, చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
● ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వరంగల్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ కారిడార్లకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యాటక రంగంలో రామప్ప దేవాలయం, వరంగల్ కోటకు సందర్శకులను పెంచుతుంది. 2028 నాటికి విమానాల టేకాఫ్ లక్ష్యంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వరంగల్ రూపురేఖలను మార్చనుంది.
ఇప్పటికే రూ.203.49 కోట్లతో
నిర్మాణ పనులకు టెండర్
తాజాగా రూ. 213.59 కోట్ల
అంచనా వ్యయంతో మరో టెండర్
ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే మారనున్న వరంగల్ రూపురేఖలు


