హనుమకొండలో మంత్రి పొంగులేటి,
వరంగల్‌లో గద్వాల విజయలక్ష్మి
ఉదయం 10 గంటలకు జెండావిష్కరణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఆరు జిల్లా కేంద్రాల్లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. హనుమకొండలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌లో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ములుగులో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ జె.రామచందర్‌నాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరిగే వరంగల్ ఓ సీటీ ఐడీఓసీ గ్రౌండ్‌ను బుధవారం సాయంత్రం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ శ్రీకాంత్ పరిశీలించారు.
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మూడో రోజు బుధవారం మూల మహాగణపతిని త్రిముఖ గణపతిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్ అధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి రుద్రేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమాదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సగర సంఘం రాష్ట్ర నాయకులు కంజుల మహేశ్ సౌజన్యంతో యాగశాలలో గణపతి నవగ్రహ రుద్రహవనం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాదాల వితరణ చేశారు. నృత్య గురువు పరమేశ్వర్ బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.
హన్మకొండ అర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ ఎ.అప్పయ్య తెలిపారు. జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 17న అప్‌లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు తమ వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో ఈ నెల 19న సాయంత్రం 5 గంటల్లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి స్పష్టం చేశారు.


