రజాకార్ల దమనకాండకు ఎదురొడ్డిన బత్తిని మొగిలయ్య
ఖిలా వరంగల్: చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఓరుగల్లు కోట.. ఒకప్పుడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యానికి వేదికగా మారింది. భూస్వామ్య దోపిడీ, అధిక పన్నులు, వెట్టిచాకిరీ, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కాకతీయుల కళా సామ్రాజ్యం కూడా ప్రతిఘటనకు కేంద్రంగా నిలిచింది.
1944లోనే పోరాట బీజాలు
1944లో వరంగల్ కోటలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షిక సమావేశంలో మతతత్వ శక్తుల దాడిని ప్రతిఘటించే క్రమంలో బత్తిని మొగిలయ్య గౌడ్ గాయపడినా తన పోరాట పటిమను ఆపలేదు. ఈ ఘటన ఆయన పోరాట జీవితంలో కీలక ఘట్టంగా నిలిచింది. అనంతరం ఆర్యసమాజ్, కాంగ్రెస్ కార్యకలాపాల్లో భాగస్వాములై నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
కోటపై జెండా ఎగరేయడంతో..
1946 ఆగస్టు 11న నిజాం పాలనలో జాతీయ జెండాను ఎగురవేయడంపై ఆంక్షలు ఉన్న సమయంలో చారిత్రక ఓరుగల్లు కోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఉద్యమకారుల ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ జెండా ఆవిష్కరణలో బత్తిని మొగిలయ్యగౌడ్ కీలక పాత్రను చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. జెండా ఆవిష్కరణను అడ్డుకునేందుకు రజాకార్లు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రజాకార్ల దాడిని ఎదుర్కొంటూ బత్తిని మొగిలియ్య గౌడ్ వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. ఈ ఘటన ఓరుగల్లు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని మరింత రగిలింపజేసింది. కాగా, స్థానిక చరిత్ర వృత్తాంతాల్లో టి.హయగ్రీవాచారి, తదితర కాంగ్రెస్ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాటి త్యాగాలను యువత గుర్తుంచుకోవాలి
నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి మన ప్రాంత రైతాంగ పోరాటయోధులు ఎన్నో కష్టాలు పడ్డారు. 1944 నుంచి 1946 వరకు కాల్చివేతలు, దాడులు, హింసను లెక్కచేయకుండా హక్కుల కోసం పోరాడారు. ఓరుగల్లు కోటపై జాతీయ జెండా ఎగురవేయడం వంటి ఘటనలు అప్పటి ప్రజల ధైర్యానికి నిదర్శనం. ఆ త్యాగాలను నేటి తరానికి చెప్పుకోవడం మన బాధ్యత. స్వేచ్ఛ విలువ, పోరాటయోధుల త్యాగాలను యువత గుర్తుంచుకోవాలి.
– గంట నరేందర్‌రెడ్డి, విద్యావేత్త,
మామునూరు
గత చరిత్రను తెలుసుకోవాలి
స్వాతంత్య్రం, ప్రజల హక్కుల కోసం గత తరాల వారు చేసిన పోరాటం గురించి తెలుసుకోవాలి. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన రైతాంగ యోధుల త్యాగాలు పుస్తకాల్లోనే కాకుండా మన చారిత్రక ప్రదేశాల్లోనూ కనిపిస్తాయి. ఖిలా వరంగల్ చరిత్రను కూడా యువతకు వివరించాలి. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సమానత్వ, ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత మనపై ఉంది.
– మేరుగు సన్నిహిత్, విద్యార్థి, వరంగల్


