నిమజ్జనానికి నీటి కొరత | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి నీటి కొరత

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

నిమజ్జనానికి నీటి కొరత

ట్రైసిటీలో కొన్ని చెరువుల్లో ఆశాజనకం, మరికొన్ని నీరు లేక వెలవెల

ఆయా నీటి వనరుల వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

వరంగల్‌ అర్బన్‌: నగరంలో ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో ఇంత వరకు భారీ వర్షం కరవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడమెలా? అని మహా నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారిస్తున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న తర్వాత గణేశ్‌ నిమజ్జనం జరుగనుంది. ఈసారి నిమజ్జనం చేసేందుకు గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని చెరువులు సరిపడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భారీ వర్షాలు కురిసిస్తే నిమజ్జనానికి నీటి కొరత తప్పుతుంది. సాధ్యమైనంత వరకు పెద్ద విగ్రహాలను చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నీటి నిల్వలపై అధికారుల సమాలోచనలు

హనుమకొండ, వరంగల్‌ కాజీపేట, చిన్న, పెద్ద చెరువుల్లో గతేడాది మొత్తం 7,500 వరకు ప్రతిమల నిమజ్జనం జరిగింది. ఈఏడాది 8 వేలకుగా ప్రతిష్టించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 90 శాతానికి పైగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ వినాయక ప్రతిమలు ఉన్నట్లు సమాచారం. ఆయా చెరువులు కొన్నింటిలో ఇప్పటికే గుర్రపు డెక్క, నాచు ఇతర వ్యర్థాలను శుభ్రం చేశారు. సిద్ధేశ్వర గుండం, బంధం చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని ఇరిగేషన్‌ ఇంజనీర్లకు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

● వరంగల్‌ చిన్నవడ్డేపల్లి చెరువులో గతేడాది 3,230 ప్రతిమలు నిమజ్జనం చేశారు. ఈఏడాది 4,300కు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. చెరువులో నీటి నిల్వలు బాగానే ఉన్నాయి. నగరవ్యాప్తంగా భారీ విగ్రహాలను ఇక్కడికే తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

● అండర్‌ రైల్వే గేట్‌ ఉర్సు రంగసముద్రంలో చెరువులో గతేడాది 700 విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది 750 వరకు వస్తాయని అంచనా. హనుమకొండ హంటర్‌ రోడ్డు ప్రాంతాల్లోని ప్రతిమలను ఉర్సు చెరువుకు మళ్లించనున్నారు.

● కట్టమల్లన్న చెరువులో గతేడాది వినాయక విగ్రహాలు 146 నిమజ్జనం కాగా, ఈ ఏడాది 170 వరకు వస్తాయని భవిస్తున్నారు. ఇక్కడ తెప్పలను ఎక్కువగా ఉపయోగించనున్నారు.

● హనుమకొండ సిద్ధేశ్వర గుండంలో గతేడాది 450 విగ్రహాలను నిమజ్జనం చేయగా, ఈ ఏడాది 500 ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. పూడికతీత త్వరలో ప్రారంభం కానుంది.

● కాజీపేట బంధం చెరువులో గతేడాది 480 ప్రతిమలను నిమజ్జనం చేయగా, ఈ ఏడాది 540 వరకు వస్తాయని భావిస్తున్నారు. మత్తడి లెవల్‌ కొంత తక్కువ వాటర్‌ ఉంది. ఈ చెరువులో అధిక తెప్పలు ఏర్పాటు చేయనున్నారు.

● హసన్‌పర్తి పెద్ద చెరువులో సుమారు 250 వరకు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి.

● వరంగల్‌ ములుగు రోడ్డులోని కోట చెరువులో మూడేళ్లుగా గణేశ్‌ ప్రతిమల నిమజ్జనాలకు బ్రేక్‌ పడింది. చెరువు కలుషితం కాకుండా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.

హనుమకొండ సిద్ధేశ్వరాలయ ఆవరణలోని

కోనేరులో తక్కువగా ఉన్న నీరు

నీరు లేక వెలవెలబోతున్న

కాజీపేట బంధం చెరువు

భారీ వర్షం కురిస్తేనే ‘గ్రేటర్‌’ చెరువులకు జలకళ

2003వ సంవత్సరంలో చెరువుల్లో నీరు లేక వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు. గణేశ్‌నిమజ్జనం చేశారు.

2014లో వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో భారీ వినాయక ప్రతిమలను పెద్ద చెరువుల్లోకి తరలించి, చిన్న విగ్రహాలను నగరంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement