హన్మకొండ కల్చరల్: ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారికి శుక్రవారం విశేషపూజలు నిర్వహించా రు. ఆలయ అర్చకులు యెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అర్చన జరిపారు. అనంతరం అమ్మవారికి ప్రీతికరమైన 1,008 తామరపూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హన్మకొండ అర్బన్: ‘రెండు వారాలకు మించి దగ్గు, ఛాతిలో నొప్పి, దగ్గినప్పుడు తెమడ పడడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రతి ఒక్కరూ తెమడ పరీక్షతో పాటు ఎక్స్‌రే పరీక్ష చేయించుకోవాలి’ అని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఎక్స్‌రే స్క్రీనింగ్ శిబిరాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి ప్రదీప్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రామ్భార్గవ్, డాక్టర్ సురేశ్, సీహెచ్ఓ మాధవరెడ్డి, డీపీఎంఓ దేవ్‌సింగ్, ఆప్తాల్మిక్ అధికారి ప్రతాప్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ కార్యాలయ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌కు తొలిసారిగా డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ పి.రతీశ్‌కుమార్‌ను నియమిస్తూ శుక్రవారం నిట్ వరంగల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 31 నిట్‌లలో తొలి నిట్ వరంగల్‌గా నిలవగా.. ఇప్పుడు తొలి డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించుకున్న తొలి నిట్ వరంగల్‌గా నిలిచింది. నిట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రతీశ్‌కుమార్‌ను డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించడంతో నిట్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
హన్మకొండ: యూనిక్ పోల్ నంబరింగ్‌తో విద్యుత్ లోపాలు, సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ బి.సామ్యా నాయక్ తెలిపారు. అత్యుత్తమ సేవలు అందించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అందుకు అనుగుణంగా మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెట్ మ్యాపింగ్, ట్రాకింగ్‌లో భాగంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్లను కేటాయించి పెయింటింగ్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 33 కేవీ పోల్ నంబరింగ్ 11,923 విద్యుత్ స్తంభాలకు, 11 కేవీ పోల్ నంబరింగ్ 80,461 విద్యుత్ స్తంభాలకు పూర్తి చేసినట్లు వివరించారు.
ముగిసిన ఐఎఫ్ఏటీ ఇండియా ప్రదర్శనలు
వరంగల్ అర్బన్: ముంబైలో మూడు రోజులపాటు జరిగిన ఐఎఫ్ఏటీ ఇండియా–2026 ప్రదర్శనలు శుక్రవారం ముగిశాయి. ఈ సదస్సుకు బల్దియా కమిషనర్ టి.వెంకన్న హాజరయ్యారు. మంచినీటి సరఫరా, ఘనవ్యర్థాలు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, ఆధునిక పరిజ్ఞానం కోసం ప్రదర్శనలు ఎంతగానో దోహద పడుతాయని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సీవరేజ్ నిర్వహణ రంగాల్లో అందుబాటులోకి వచ్చిన నూతన విధానాలను ఆయన పరిశీలించారు. సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ ఫల్గుణ్కుమార్, పలు కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.


