హన్మకొండ అర్బన్: ‘సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. నోటీసులో పేర్కొన్న ఆధారాలు సమర్పిస్తే సరిపోతుంది’ అని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అదనపు కలెక్టర్ ఎన్.రవి కలెక్టరేట్ నుంచి ఫోన్‌ఇన్‌లో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్‌తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల సందేహాలు నివృత్తి చేశారు.
ప్రశ్న: ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల్లో పేరు తప్పుగా ఉంది.. ఏం చేయాలి?
–నవీన్, పరకాల/స్వామి, రత్నగిరి, భీమదేవరపల్లి
అదనపు కలెక్టర్: స్పెల్లింగ్ తప్పు పెద్ద సమస్యేమీ కాదు. నోటీస్ జారీ అయితే ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో పేరులో స్పెల్లింగ్ సరిగ్గా ఉన్న ఏదైనా ఒక పత్రాన్ని తీసుకెళ్లి బూత్ స్థాయి అధికారికి సమర్పించాలి. మీరు వెళ్లలేకపోతే బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా పత్రాలు అందించవచ్చు.
ప్రశ్న: 25 ఏళ్లుగా గ్రామంలో ఉంటున్నాం. 2002 నాటి వివరాలు అడుగుతున్నారు.. ఏం చేయాలి?
– అమ్మ అశోక్, పెద్దకోడెపాక, శాయంపేట
అదనపు కలెక్టర్: నోటీసులు అందుకున్న వారు 1987 తర్వాత పుట్టినవారైతే వారి తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. నోటీసులో కోరిన ఆధారాలను బూత్ స్థాయి అధికారికి అందజేయాలి.
ప్రశ్న: మా ఓట్లు తొలగించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేవు. మేం ఇచ్చిన వివరాలను బీఎల్‌ఓ నమోదు చేయలేదు. ఇప్పుడెలా?
– ఎ.రవి, హనుమకొండ
అదనపు కలెక్టర్: వివరాలు నమోదు చేయడంలో పొరపాటు జరిగి ఉంటే అధికారులు పరిశీలిస్తారు. అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. సంబంధిత సహాయ ఎన్నికల నమోదు అధికారికి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి.
ప్రశ్న: మా ఇంట్లో నలుగురికి నోటీసులు ఇచ్చారు. పాత వివరాలు అడుగుతున్నారు. ఏం ఇవ్వాలి?
– డోలిపురి రామచంద్రన్, పరకాల
అదనపు కలెక్టర్: పెద్దలకు బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్ ఆధారాల్లో ఏదైనా సమర్పించాలి. యువతకు సంబంధించి నోటీసులు వస్తే జ నన ధ్రువపత్రాలు, పదో తరగతి మెమోతో పాటు తల్లిదండ్రుల ఓటరు వివరాలు అందించాలి.
ఎక్కడున్నా ఓటర్ పోర్టల్‌లో వివరాలు పరిశీలించుకోవచ్చు
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి
‘సర్’ ప్రక్రియపై ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఓటర్ల నుంచి విశేష స్పందన
ప్రశ్న: మాది దామెర గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఊరిలోనే ఓటు కావాలి. ముసాయిదా జాబితాను ఎలా చూసుకోవాలి? నోటీసులు ఎవరికి ఇస్తారు?
– రాజు, దామెర
అదనపు కలెక్టర్: మీరు ఎక్కడున్నా ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్‌లో మీ వివరాలను పరిశీలించుకోవచ్చు. అందులో పేరు ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ పేరు ఉన్నప్పటికీ నోటీసు వచ్చినట్లు తెలిస్తే సంబంధిత బూత్ స్థాయి అధికారికి నోటీసులో అడిగిన వివరాలను అందజేయాలి.
ప్రశ్న: నోటీసుకు ఇచ్చిన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందారో లేదో ఎలా తెలుస్తుంది? – తారాబాయి,
చైతన్యపురి కాలనీ, హనుమకొండ
అదనపు కలెక్టర్: నోటీసు వచ్చిన అనంతరం తగిన ఆధారాలను అధికారికి సమర్పిస్తే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందించినా, సమాచారం మిస్‌మ్యాచ్ అయినా రెండో నోటీస్ అందిస్తారు.


