హన్మకొండ: హనుమకొండ కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలోని శక్తి సదన్‌ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రయం పొందుతున్న బాలికలు, మహిళలతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శక్తి సదన్‌లో అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్ శిక్షణ వంటి వృత్తి విద్యా కోర్సుల వివరాలు అడిగి తెలుసుకున్నా రు. విద్యాఽభ్యాసం పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఈఓ ఆశాదేవి, శక్తిసదన్ సూపరింటెండెంట్ శైలజ పాల్గొన్నారు.
కాజీపేట బస్‌స్టేషన్ ప్రతిపాదిత స్థల పరిశీలన..
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లోని శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న స్థలాన్ని రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించారు. కాజీపేట ప్రధాన రహాదారి పక్కన ఉన్న హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగే బస్టాండ్‌ను ఆమె పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్టీసీ ఆర్‌ఎం భవానీ ప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎం కిషన్‌రావు, డీఎం ధరమ్‌సింగ్, కాజీపేట తహసీల్దార్ రాజు, కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఐఓడబ్ల్యూ శ్రీనివాస్ పాల్గొన్నారు.


