అభ్యంతరాలకు ఈనెల 15వరకు గడువు | - | Sakshi
Sakshi News home page

అభ్యంతరాలకు ఈనెల 15వరకు గడువు

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

న్యూశాయంపేట: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ వరంగల్‌ జిల్లా సొసైటీ ఎన్నికల ఓటర్ల జాబితాను కలెక్టరేట్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయం, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయం, నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి నీరజ ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు, సవరణలు, చేర్పులు ఉంటే ఈనెల 15లోగా సమర్పించాలని ఆమె పేర్కొన్నారు.

ముందుకు కదలని

సర్‌ప్లస్‌ టీచర్ల జాబితా?

కలెక్టరేట్‌లోనే మూలుగుతున్న ఫైల్‌

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మిగులు (సర్‌ప్లస్‌) టీచర్ల జాబితా ఫైల్‌ కలెక్టరేట్‌లో ముందుకు కదలడం లేదు. జిల్లాలో మూతపడిన 129 పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి డీఈఓ ఇటీవల మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సర్‌ప్లస్‌ టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగా.. ఎంఈఓలు మిగులు ఉపాధ్యాయులను గుర్తించి డీఈఓకు నివేదిక అందజేశారు. డీఈఓ జాబితా ఫైల్‌ను కలెక్టర్‌ అనుమతి కోసం పంపగా ఇప్పటి వరకు ఆఫైల్‌ క్లియర్‌ కాలేదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ, పంచాయతీరాజ్‌ , డీఆర్‌డీఓ, మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రతి ఫైల్‌ను అదనపు కలెక్టర్‌ (లో కల్‌ బాడీ) పర్యవేక్షణలో తనకు పంపించాలని కలెక్టర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ ఫైల్‌ ఆలస్యమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

ప్రాణం తీసిన చేపల వేట..

కుంటలో పడి యువకుడి మృతి

ాజీపేట అర్బన్‌ : చేపల వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కాజీపేట మండలం అమ్మవారిపేట కుంట వద్ద చోటు చేసుకుంది. మృతుడి తల్లి రోండ్ల రమ కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన రోండ్ల రమ కుమారుడు వెంకటేష్‌రెడ్డి(26) కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ తరచూ చేపలు పట్టేవాడు. రోజు మాదిరిగానే ఈనెల 8వ తేదీన కూలీకి వెళ్లాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు ఫోన్‌ చేయగా ఇంటికి వస్తున్నట్లు తెలిపి రాలేదు. ఉదయం వరకు వేచి ఉండి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆచూకీ కోసం తిరుగుతుండగా గురువారం రమ బంధువు శ్రీనివాస్‌రెడ్డి వచ్చి వెంకటేష్‌రెడ్డి బైక్‌ అమ్మవారిపేట కుంట వద్ద ఉందని తెలిపాడు. దీంతో తల్లి రమ అక్కడి వెళ్లి చూడగా వెంకటేష్‌రెడ్డి కుంటలో పడి చనిపోయాడు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని, తమకు ఎవరిపై అనుమానం లేదని తెలిపింది. ఈ ఘటనపై మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జీవించి సాదిద్దాం

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

హన్మకొండ అర్బన్‌: కష్టాలెన్ని ఉన్నా జీవించి సాధిద్దామని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం సిద్దాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు హోంవర్క్‌ను అదే రోజు పూర్తి చేయాలని కోరారు. ఎవరైనా ఒంటరిగా ఉండడం, తమలో తాము మాట్లాడుకోవడం, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమస్యలను పంచుకోవాలని సూచించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై 14416, 104 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు. అసంక్రమిత వ్యాధుల కార్యక్రమ అధికారి డాక్టర్‌ మురళి, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీపాల్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement