విధి నిర్వహణలో 8 మంది మృతి..
ట్రాక్‌మెన్లకు భద్రత కల్పించాలి
రిస్క్ అలవెన్స్ పెంచాలి
ఖిలా వరంగల్: రైలు ప్రయాణం సురక్షితంగా సాగాలంటే పట్టాలు పటిష్టంగా ఉండాలి. పట్టాలపై చిన్న లోపం తలెత్తినా దాని ప్రభావం భారీగా ఉంటుంది. అలాంటి లోపాలను ముందుగానే పసిగట్టి సరిచేసే బాధ్యత ట్రాక్‌మెన్ (ట్రాక్ మెయింటెనర్లు)లదే. రైల్వే వ్యవస్థలో వీరు అత్యంత కీలక విధులు నిర్వర్తిస్తున్నారు.
కంటికి కనిపించని కష్టం..
రైల్వే ట్రాక్ పటిష్టతను ఎప్పటికప్పుడు పరిశీలించడం, పట్టాలపై లోపాలను గుర్తించడం, అవసరమైన మరమ్మతులు చేయడం, ట్రాక్ పెట్రోలింగ్ నిర్వహించడం వంటి బాధ్యతలను ట్రాక్‌మెన్ నిర్వర్తిస్తారు. పట్టాలపై చిన్న పగుళ్లు, అమరికలో తేడాలు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రయాణికులకు రైలు కొన్ని నిమిషాల ఆలస్యం పెద్ద విషయంగా కనిపించొచ్చు. కానీ, ఆ రైలు పట్టాలపై సురక్షితంగా పరుగెత్తేందుకు గంటల తరబడి ఎండలోనూ, వానలోనూ ట్రాక్‌మెన్‌లు పనిచేయాలి. వారి కష్టం మాత్రం సాధారణ ప్రయాణికుడి కంటికి కనిపించదు.
వాతావరణ పరిస్థితులు పెద్ద సవాల్..
ట్రాక్‌మెన్ విధుల్లో వాతావరణ పరిస్థితులు పెద్ద సవాల్‌గా ఉంటాయి. మండే ఎండలో కిలోమీటర్ల మేర పట్టాల వెంట నడుస్తూ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలమయమైన ప్రాంతాల్లోనూ ట్రాక్ పరిస్థితులను పరిశీలించా లి. రాత్రివేళ పెట్రోలింగ్ చేయాల్సిన సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక వైపు రైళ్ల రాకపోకలు.. మరోవైపు పట్టాలపై విధులు, ప్రతి క్షణం అప్రమత్తత అవసరమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీరి ప్రాణాలకు ముప్పు తప్పదు.
ప్రాణాలతో చెలగాటం..
ట్రాక్‌మెన్ పని కేవలం పట్టాలపై నడవడం కాదు.. భారీ పరికరాలతో పనిచేయాలి. ట్రాక్ నిర్వహణలో భాగంగా శారీరక శ్రమ చేయడం, రైళ్ల రాకపోకల మధ్య విధులు నిర్వర్తించడం వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైళ్ల రాకపోకలు అధికంగా ఉండే మార్గాల్లో ట్రాక్ తనిఖీలు, మరమ్మతులు చేపట్టేటప్పుడు భద్రతా నిబంధలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తమకు అందుబాటులో ఉండే భద్రతా పరికరాలు, రక్షణ వ్యవస్థలు, సరైన శిక్షణ ఎంతో కీలకమని సిబ్బంది చెబుతున్నారు.
పట్టాల భద్రతకు వీరే కాపలా..
సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాక్‌మెన్‌లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ప్రా ణాలు సైతం కోల్పోతున్నారని వరంగల్ బ్రాంచ్ సంఘ్ నా యకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు కూత వినిపించగానే ప్రయాణికులు అప్రమత్తమవుతారు. కానీ, అదే రైలు సురక్షితంగా వెళ్లేందుకు పట్టాలపై కాపలా కాసే ట్రాక్‌మెన్ మాత్రం ప్రతి క్షణం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు.
ట్రాక్‌మెన్ల డిమాండ్లు..
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బ్రిటిష్ కాలం నాటి అధిక పనిభారాన్ని తగ్గించాలి. మహిళలను మరో డిపార్ట్‌మెంట్‌కు కేటాయించాలి. రిస్క్ అలవెన్స్‌ను గణనీయంగా పెంచాలి. పెట్రోలింగ్ బిట్ లెంత్ తగ్గించి, హంట్లను ఏర్పాటు చేయాలి. పెట్రోలింగ్ సమయంలో నాణ్యతగల టార్చ్‌లైట్, సేఫ్టీ పనిముట్లు ఇవ్వాలి. తాగునీరు, విశ్రాంతి గదులతోపాటు మెరుగైన రెయిన్‌కోట్, షూ, వింటర్ జాకెట్ అందించాలి. పదోన్నతులు ఇవ్వాలి.
ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తే తమ భద్రత, సంక్షేమాన్ని విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం సరికాదని ట్రాక్‌మెన్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, మధిర సెక్షన్ల పరిధిలో సుమారు 8 మంది ట్రాక్‌మెన్లు విధుల్లో రైళ్లు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకున్నారని సిబ్బంది చెబుతున్నారు.
రైళ్ల రాకపోకలకు భద్రతా కవచం.. ట్రాక్‌మెన్
పట్టాల నిర్వహణ, పెట్రోలింగ్‌లో అత్యంత కీలకం
ఎండ, వాన, చీకటి, ఎప్పుడైనా విధుల్లోనే..
సమస్యలు పరిష్కరించాలంటున్న సిబ్బంది
రైల్వే ట్రాక్‌లను నిరంతరం తనిఖీ చేస్తున్నాం. లోపాలను గుర్తించి మరమ్మతులు చేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. రాత్రి వేళ సరైన టార్చ్‌లైట్ల లేక చీకట్లో పట్టాలపై నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నాణ్యమైన రెయిన్‌కోట్లు, అధునాతన టార్చ్‌లైట్లు ట్రాక్‌మెన్లకు అందజేసి భద్రతకు చర్యలు తీసుకోవాలి. రానున్న పీఆర్సీలో ట్రాక్‌మెన్‌కు శ్రమ తగ్గ ఫలితం చూపాలి.
– ఎండీ రఫీక్, సంఘ్ కోశాధికారి వరంగల్
ట్రాక్‌పై ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న ట్రాక్‌మెన్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ అలవెన్స్‌ను గణనీయంగా పెంచాలి. పెట్రోలింగ్ బిట్ లెంత్ తగ్గించి హంట్ ఏర్పాటు చేయాలి.
– సీహెచ్.వెంకటేశ్,
సంఘ్ ఉపాధ్యక్షుడు వరంగల్


