సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

Aug 18 2026 9:14 AM | Updated on Aug 18 2026 9:14 AM

హన్మకొండ: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగుతుందని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌ అన్నారు. యాదాద్రి పవర్‌ థర్మర్‌ పవర్‌ స్టేషన్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం ఈ నెల 19న నిర్వహించనున్న విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నా పోస్టర్‌ను తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌ రమణారావు, నాయకులు సామ్యానాయక్‌, నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, మల్లికార్జున్‌, పి.మహేందర్‌ రెడ్డి, కుమారస్వామి, మచ్చిక బుచ్చయ్యగౌడ్‌. చిట్ల ఓదెలు, జశ్వంత్‌కుమార్‌, విద్యుత్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రతీ గర్భిణి వివరాలు నమోదు చేయాలి

మాతా శిశు సంక్షేమం కార్యక్రమ అధికారి డాక్టర్‌ రజిత

హన్మకొండ అర్బన్‌: లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం ప్రకారం స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు అన్ని రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని మాతా శిశు సంక్షేమం కార్యక్రమ అధికారి డాక్టర్‌ రజిత సూచించారు. సోమవారం హనుమకొండ, పరకాలలోని స్కానింగ్‌ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి రిజిస్ట్రేషన్‌, ఫీజుల చెల్లింపులు, స్కానింగ్‌ నివేదికలు, వైద్యుల వివరాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. స్కానింగ్‌కు వచ్చిన ప్రతీ గర్భిణి పూర్తి వివరాలను ఫారం–ఎఫ్‌లో నమోదు చేసి, రోజువారీ వివరాలను ఆన్‌న్‌లైన్‌లో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఈనంబర్‌లో 63000 30940 ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామన్నారు. అనంతరం శాయంపేట, కమలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాతా శిశు సంక్షేమ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సాయికృష్ణ, ఆరోగ్య పర్యవేక్షకులు పద్మజ, సందీప్‌ పాల్గొన్నారు.

కరాటే మాస్టర్ల గిన్నిస్‌ రికార్డు

కాజీపేట రూరల్‌: కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి పాశం దేవయ్య బ్లాక్‌ బెల్ట్‌, నయీంనగర్‌కు చెందిన దామెర శంకర్‌ బ్లాక్‌ బెల్ట్‌ గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. పాశం దేవయ్య తెలిపిన వివరాల మేరకు.. వరల్డ్‌ కరాటే మాస్టర్స్‌ అసిసియేషన్‌ (డబ్ల్యూకేఎంఏ) ప్రెసిడెంట్‌ ఎస్‌.బాలమురుగన్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న సెయింట్‌ థామస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో నిర్వహించిన ఆల్‌ టైం రికార్డ్స్‌ కరాటే బుడోకాన్‌ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ సభ్యులు అయిన దేవయ్య, శంకర్‌ పాల్గొని రికార్డు సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బుడోకాన్‌ కరాటే ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ అధ్యక్షుడు బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్‌, పాండ దినేశ్‌, ఎం.రవిదుర్గాప్రసాద్‌ అభినందించారు.

డీఎంఓకు ఘననివాళి

ఖిలా వరంగల్‌: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వరంగల్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖకు సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద నివాళులర్పించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సురేఖ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, జిల్లా వ్యవసాయశాధికారి విజయ భాస్కర్‌, డీఎం సంధ్యారాణి, డీఎస్‌ఓ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు.

ఉరేసుకుని ట్రైనీ డీటీ బలవన్మరణం

మహబూబాబాద్‌ రూరల్‌: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్ప డిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్‌ సీఐ ఎల్‌.రఘుపతిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఎన్‌ రెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్నకుమార్తె డోలి సంధ్య (28) స్థానిక మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించింది. అనంతరం గ్రూప్‌–2 రాయగా డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం పొందింది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి సంధ్య ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన తల్లి పద్మ చుట్టుపక్కల వారికి, తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. అనంతరం వెంకటేశ్వర్లు పోలీసులకు విషయాన్ని తెలిపారు. సంఘటనా స్థలాన్ని టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి, క్రైం, టౌన్‌ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య సందర్శించి సంధ్య మృతికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు అనంతరం ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతురాలు సంధ్య ఇటీవల ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement