● అన్ని రంగాల్లో..
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం దూరదృష్టితో జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రత్యేక వాహనంపై పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో సాధారణంగా 1,39,997 ఎకరాల్లో వరి సాగువుతుండగా.. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో 51,045 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయని తెలిపారు. మరో 44,745 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర తదితర ఆరుతడి పంటల సాగవుతున్నాయని పేర్కొన్నారు.
1,40,862 కుటుంబాలకు
గృహజ్యోతి..
గృహజ్యోతి పథకం కింద 1,40,862 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.128.82 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,522 ఇళ్లు మంజూరు కాగా, 2,973 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా 2,114 మహిళా సంఘాలకు రూ.148.80 కోట్ల రుణాలు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. 34,964 మంది విద్యార్థుల యూనిఫాం తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో రూ.1,371 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో రూ.56.06 కోట్ల వ్యయంతో 10,565 మందికి వైద్యం అందించామని చెప్పారు.
టెక్స్‌టైల్ పార్కుకు
1,357 ఎకరాల భూమి
టెక్స్‌టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమిని సేకరించామని మంత్రి వివరించారు. 866 మంది రైతులకు రూ.145 కోట్ల పరిహారం చెల్లించామని, భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, ఈప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించి 330 మంది రైతులకు రూ.258 కోట్ల పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. వరంగల్ బస్‌స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.94.10 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా 25.51 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 11.50 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం..
స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి ఘనంగా సన్మానించారు. అంతకు ముందుగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మేర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సంగ వెంకట్రాజం, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్ ,డీసీపీ అంకిత్‌కుమార్, డీఎఫ్‌ఓ నిఖిత, డీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం దూరదృష్టితో
గణనీయమైన ప్రగతి
80వ స్వాతంత్య్ర దినోత్సవంలో
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
ఖుష్‌మహల్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరణ


