ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారదతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 16న సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనకు సంబంధించి సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్ తదితర అంశాలపై చర్చించారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడంతోపాటు విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించి, నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.


