సొంతింటి కల సాకారమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల సాకారమే ధ్యేయం

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

‘డబుల్‌’ పట్టాల పంపిణీలో రసాభాస

కమలాపూర్‌ : అర్హులైన పేద కుటుంబానికి సొంతిళ్లు అందించి వారి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ తౌటం ఝాన్సీరాణితో కలిసి మంత్రి పొంగులేటి సోమవారం గూడూరులో ప్రారంభించారు. కమలాపూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కమలాపూర్‌ మండలంలో కేసీఆర్‌ నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉప్పల్‌ను, వీణవంక మండలంలోని చల్లూరును మండలాలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు బండి వనజకళాధర్‌, పబ్బు సతీశ్‌, అదనపు కలెక్టర్‌ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌ నేత, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఒడితల ప్రణవ్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్దార్థ నాయక్‌, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతకుముందు గూడూరులో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు.

అర్హులైన ప్రతీ కుటుంబానికి

ఇందిరమ్మ ఇళ్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మంత్రి పొంగులేటితో

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వాగ్వాదం

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభస చోటుచేసుకుంది. కమలాపూర్‌లో సోమవారం డబుల్‌ బెడ్రూం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు పంపిణీ చేస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేసీఆర్‌ హయాంలో నిర్మించినవేనని, మీరిచ్చిన హామీలు అమలు చేయాలని, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మంత్రులను కోరారు. ఇందుకు మంత్రి పొన్నం కౌంటర్‌ ఇవ్వగా స్టేజీపైనే పొంగులేటి, కౌశిక్‌రెడ్డి కాసేపు వాగ్వాదం చేసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడాతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పట్టి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతూ అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడాలని, ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ స్టేజీపైనే మంత్రితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు స్టేజీపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement