శాయంపేట : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలకు చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవా రు జామున చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల పరమేష్ కథనం ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పల్లెబోయిన భిక్షపతి (45) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చేపలు పట్టేందుకు మండలంలోని జోగంపల్లి శివారులో చలివాగు ప్రాజెక్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలో ఉన్న చేపలు తీస్తుండగా ప్రమాదవశాత్తు భిక్షపతి కాళ్లు, చేతులు వలలో చిక్కుకోగా మృతిచెందాడు. తెల్లవారిన కూడా భిక్షపతి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు, తోటివారు చలివాగు వద్దకు వెళ్లి వెతకగా వలలో చిక్కుకొని భిక్షపతి మృతి చెంది కనిపించాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.


