కాజీపేట రూరల్ : కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సులో ప్రధాన ఘట్టం సందల్ వేడుకలు సోమవారం అర్ధరాత్రి ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వైభవంగా నిర్వహించారు. దర్గా ఉర్సులో బియాబాని పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తున్న సందల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా ఆధ్వర్యంలో బడేఘర్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధం, చాదర్‌తో ఉన్న వెవెండి గిన్నెను, తలపై పెట్టుకొని ఊరేగింపుగా భక్తుల మధ్య తీసుకెళ్తుండగా వెండిగిన్నెను తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఖవ్వాలి, కీర్తనలు, డీజేలు, యువకుల కేరింతలు, నృత్య విన్యాసాలతో దర్గా ప్రాంగణం మార్మోగింది. అర్ధరాత్రి సందల్‌తో దర్గాకు చేరుకున్న ఖుస్రుపాషా హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని సమాధిని రోజ్‌వాటర్‌తో కడిగి, గంధ లేపనం చేసి, పూల్ చాదర్‌కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గాను సోమవారం రాత్రి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అజారుద్దీన్‌తోపాటు ఎమ్మెల్యేలు కే.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా, ఉప పీఠాధిపతి భక్తియార్ బియాబాని, జిల్లా అధికారులు తదితరులు సందర్శించారు. హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని మజార్‌పై పూలు చల్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అల్లా కృపతో దర్గా ఉత్సవాలు గొప్పగా జరగాలని ఆకాంక్షించారు. దర్గా అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
బడేఘర్ నుంచి దర్గా వరకు ఊరేగింపు
ఉత్సవాలను ప్రారంభించిన పీఠాధిపతి ఖుస్రుపాషా
దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు
దర్గాను దర్శించుకున్న మంత్రులు,
ఎమ్మెల్యేలు


