ఖిలా వరంగల్: రైలులో ప్రయాణికురాలి నుంచి బంగారు పుస్తెల తాడు చోరీ చేసిన నిందితుడిని ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ నరేశ్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు వరంగల్ ఎల్గూరు రంగంపేట రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌కాగజ్‌నగర్‌లోని అంబేడ్కర్‌కాలనీకి చెందిన దుర్గం రాజు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసిన బంగారు పుస్తెల తాడు అతడి వద్ద ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద నిందితుడు రూ.6 లక్షల విలువైన 44.509 గ్రాముల బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని నిందితుడు దుర్గం రాజును రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వడ్డె నరేశ్‌కుమార్ తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ప్రభాకర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాశ్, రమేష్, ఏడుకొండలు, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.
● రూ.6 లక్షల విలువైన బంగారు పుస్తెల తాడు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ వడ్డె నరేశ్‌కుమార్


