● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో చేనేత, జౌళి శాఖ శుక్రవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చేనేత భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ, ఆధునిక సాంకేతికత, నూతన డిజైన్లు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా చేనేత కార్మికుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హనుమకొండ ఇన్‌న్‌చార్జ్ కలెక్టర్ రవి మాట్లాడుతూ చేనేత రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అనంతరం జిల్లాలోని 774 మంది లబ్ధిదారులకు చేనేత భరోసా పథకం కింద మంజూరైన రూ.24 లక్షల చెక్కును ఎమ్మెల్యే, ఇన్‌న్‌చార్జ్ కలెక్టర్ పంపిణీ చేశారు. చేనేత కార్మికులను సన్మానించి, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. చేనేత వస్త్రాల విక్రయ స్టాల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే చేనేత చీరను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారులు, సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.


